‘‘మేడం.. మాకు ఉద్యోగాలిచ్చి న్యాయం చేయండి’’

by Disha Web |
‘‘మేడం.. మాకు ఉద్యోగాలిచ్చి న్యాయం చేయండి’’
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్సీ 1998 రాత పరీక్షలో ప్రభుత్వం నిర్దేశించిన కనీస అర్హత మార్కులు సాధించి ఇంటర్వ్యూ ద్వారా క్వాలిఫై అయ్యామని, అయినా తమను ఉద్యోగాలు ఇవ్వలేదని డీఎస్సీ 1998 బాధితులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి తమ ఆవేదనను వెళ్లగక్కారు. పంజాగుట్టలోని మంత్రి నివాసంలో బాధితులు శనివారం కలిశారు. ఈమేరకు మంత్రికి వినతిపత్రం అందజేశారు. అనంతరం 1998 డీఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కే శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. న్యాయస్థానం నుంచి తమకు అనుకూలంగా తీర్పులు వచ్చినా అమలుకాలేదన్నారు. 2016లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ క్యాంపు కార్యాలయంలో తమ ప్రతినిధి బృందంతో రెండున్నర గంటలపాటు చర్చించి డీఎస్సీ 1998 క్వాలిఫైడ్ బాధితులకు మానవతా దృక్పథంతో ఉద్యోగాలిచ్చి న్యాయం చేస్తామని అభయమిచ్చారని గుర్తుచేశారు.

ఏపీ ప్రభుత్వం అక్కడి వారికి కనీస వేతన స్కేల్ పద్ధతిన ఉద్యోగాలిచ్చి న్యాయం చేసిందని, అలాగే తమకు కూడా న్యాయం చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరినట్లు శ్రీనివాస్ తెలిపారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే మంత్రివర్గ సబ్ కమిటీలో చర్చించి సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారని ఆయన చెప్పారు. మంత్రిని కలిసినవారిలో 1998 డీఎస్సీ సాధన సమితి గౌరవాధ్యక్షుడు నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి బొల్లెపల్లి రఘురామరాజు, ఉపాధ్యక్షులు ఉపేందర్, పందిరి సత్యనారాయణ, నర్సయ్య, నాయకులు ఇబ్రహీం, గోపాల్ గౌడ్, బాల రాజ్ గౌడ్, త్రివిక్రమ్ రావు, రామ్మూర్తి, నర్సింహులు, మహ్మద్ సుల్తాన్, చారి తదితరులు ఉన్నారు. అనంతరం సాధన సమితి నాయకులు నాంపల్లిలోని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.Next Story