- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాలిసెట్ మొదటివిడతలో 18,984 సీట్ల కేటాయింపు
తెలంగాణ పాలిసెట్-2025 మొదటి విడత అడ్మిషన్లకు సంబంధించిన వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు వివరాలను సాంకేతిక విద్యాశాఖ మంగళవారం విడుదల చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పాలిసెట్-2025 మొదటి విడత అడ్మిషన్లకు సంబంధించిన వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు వివరాలను సాంకేతిక విద్యాశాఖ మంగళవారం విడుదల చేసింది. విద్యా సంవత్సరం 2025-2026కు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కౌన్సెలింగ్ మొదటివిడతలో 18,984 మంది విద్యార్థులు సీట్లు పొందారు. ఇందులో ప్రయివేటులో 7529 కాగా, ప్రభుత్వ కాలేజీల్లో 1,1455 సీట్లు భర్తీ అయ్యాయి. పాలిసెట్ 2025లో 80.949 మంది అర్హత సాధించగా, 20,811 మంది విద్యార్థులు ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. మొత్తం ఆప్షన్ల సంఖ్య 4,75,690 కాగా వందశాతం సీట్లు నిండిన సంస్థలు మొతంతం 6 ఉన్నాయి. అందులో 5 ప్రభుత్వ, 1 ప్రైవేట్ అన్ఎయిడెడ్ సంస్థలున్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 713 సీట్లు భర్తీ అయ్యాయి.
జులై 31న తరగతులు ప్రారంభం:
ఎన్ సీసీ, స్పోర్ట్స్ వంటి స్పెషల్ కేటగిరీ సీట్లు తుది విడత కౌన్సిలింగ్‌లో కేటాయిస్తారు. అభ్యర్థులు తమ అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, ఫీజు చెల్లించాలి. జూలై 18 లోపు ఫీజు చెల్లించని వారికి లేదా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని వారికి అలాట్‌మెంట్ రద్దవుతుంది. ఫీజు చెల్లింపు అభ్యర్థులు, తల్లిదండ్రుల స్వంత బ్యాంక్ ఖాతాల నుండి చేయాలి. ఏదైనా రీఫండ్‌లు ఉంటే అదే ఖాతాకు జమ చేయబడతాయి. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ ద్వారా అడ్మిషన్ నిర్ధారించుకోవడం తప్పనిసరి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన అభ్యర్థులు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దగ్గర్లోని హెల్ప్‌లైన్ సెంటర్‌ను సంప్రదించాలి. తుది విడత కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత అభ్యర్థులు జూలై 28 నుండి జూలై 30 వరకు అలాట్ అయిన కాలేజీల్లో వ్యక్తిగతంగా రిపోర్ట్ చేయాలి. ప్రస్తుత అలాట్‌మెంట్‌తో సంతృప్తి చెందిన వారు మళ్లీ ఆప్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ కాలేజీల్లో వ్యక్తిగతంగా రిపోర్ట్ చేసి బయోమెట్రిక్ ద్వారా హాజరును నమోదు చేసుకోవాలి. ఎన్‌సిసి, స్పోర్ట్స్ కోటా కింద రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకునే అభ్యర్థులు తుది విడత కౌన్సిలింగ్‌లో ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. విద్యా సంవత్సరం జూలై 28 న ప్రారంభమవుతుంది. ఓరియంటేషన్ జూలై 28 నుంచి 30 వరకు ఉంటుంది. తరగతులు జూలై 31 నుండి ప్రారంభమవుతాయి.
అంతర్గత స్లైడింగ్ (కాలేజీల్లో బ్రాంచ్ మార్పు) ఆగస్టు 2 నుంచి ఆగస్టు 3 వరకు ఉంటుంది. దీనికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది. సీటు రద్దు చేయాలనుకుంటే https://tgpolycet.nic.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ క్యాన్సిలేషన్ ఆఫ్ అలాటెడ్ సీట్ ఆప్షన్‌ను ఉపయోగించాలి. సీటు రద్దు చేసుకుంటే తదుపరి కౌన్సిలింగ్‌లో పాల్గొనడానికి అనుమతించరు. పూర్తి వివరాలకోసం విద్యార్థులు https://tgpolycet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.






