ఏసీబీ అక్టోబర్ ఆపరేషన్‌‌లో 18 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్‌.. లంచాల లింక్‌ చెక్‌ పోస్ట్‌ల వరకు!

by Ramesh Naini |   (  Updated:2025-11-01 14:48:53  IST  )

ఏసీబీ అధికారుల దాడుల్లో అక్టోబర్ నెలలో 15 కేసులు నమోదు అయ్యాయి. 15 కేసులలో 18 మంది ప్రభుత్వ ఉద్యోగలపై కేసులు నమోదు చేశారు.

ఏసీబీ అక్టోబర్ ఆపరేషన్‌‌లో 18 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్‌.. లంచాల లింక్‌ చెక్‌ పోస్ట్‌ల వరకు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏసీబీ (ACB) అధికారుల దాడుల్లో (October) అక్టోబర్ నెలలో 15 కేసులు నమోదు అయ్యాయి. 15 కేసులలో 18 మంది ప్రభుత్వ ఉద్యోగలపై కేసులు నమోదు చేశారు. ఒక అవుట్ సోర్సింగ్ వ్యక్తి, మరో ఇద్దరు ప్రైవేటు వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనవరి నుంచి అక్టోబర్ వరకు 218 కేసులు నమోదైనట్లు తెలిపారు. అక్టోబర్ వరకు 13 కేసులలో రూ.58.36 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించినట్లు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 18వ తేదీ అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 12 చెక్ పోస్ట్‌లలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. చెక్ పోస్ట్ లలో లెక్కలోలేని రూ.4.18లక్షల నగదు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీఏ చెక్ పోస్ట్‌లలో వాహన డైవర్ల నుంచి డబ్బులు తీసుకుంటున్నారని ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారని రిపోర్ట్ అందజేశారు.

పట్టుబడిన వారిలో ముఖ్య వివరాలు..

  • నల్గొండ జిల్లా చిట్యాల తహసిల్దారు గుగులోత్ కృష్ణ రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ 9వ తేదీన పట్టుబడ్డారు. వ్యవసాయ భూమి మ్యుటేషన్ చేసేందుకు ఓ రైతు వద్ద రూ.10 లక్షలు డిమాండ్ చేసి రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుబడ్డారు. తహసిల్దారుతో పాటు మరో వ్యక్తి పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.
  • ఫారెస్ట్ అధికారులు సైతం ఏసీబీకి పట్టుబడటం జరిగింది. 17వ తేదీన వికారాబాద్ జిల్లా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు ఏసీబీకి పట్టుబడ్డారు. అటవీ ప్రాంతంలో లభించే సీతాఫలాలు సరఫరా చేస్తున్న వారి వాహనాలకు అనుమతులిచ్చే విషయంలో రూ.40వేల రూపాయలు డిమాండ్‌ చేసి పట్టుబడ్డారు. వీరితో పాటు అవుట్ సోర్సింగ్ విభాగంలో చేస్తున్న డ్రైవర్ పై కూడా కేసు నమోదు చేశారు.
  • కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా డిస్టిక్ కోపరేటివ్ ఆఫీస్ లో డిప్యూటీ రిజిస్ట్రార్ రాథోడ్ బిక్కు రెండు లక్షలు లంచం తీసుకుంటుండగా 25వ తేదీన ఏసీబీకి పట్టుబడ్డారు. సస్పెండ్ కాబడిన ఉద్యోగి అలవెన్స్ వేతనాలు చెల్లించేందుకు, సస్పెన్షన్ ఎత్తివేసేందుకు రూ.7 లక్షలు లంచం డిమాండ్ చేసి రూ.5 లక్షలకు ఒప్పందం చేసుకుని మొదటి విడతగా రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
  • యాద్రాద్రి భువనగిరి జిల్లా ఎండోమెంట్ విభాగంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడిలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకట రామారావు 29వ తేదీన పట్టుబడ్డారు. రూ.11.50లక్షల బిల్లు చేసేందుకు రూ.1.90లక్షల లంచం డిమాండ్ చేసి తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
Next Story