- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు 16 టీఎంసీలు.. ఏపీకి 10 టీఎంసీలు
కృష్ణా జలాల కేటాయింపులపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల నడుమ కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: కృష్ణా జలాల కేటాయింపులపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల నడుమ కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తాగునీటి అవసరాలపై సమాలోచనలు జరిపింది. ప్రస్తుత జలాశయాల్లో ఉన్న నిల్వలు, రెండు రాష్ట్రాల అవసరాలు, ఇప్పటికే జరిగిన వినియోగం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని నీటి కేటాయింపులు ఖరారు చేసింది. మిగిలిన వేసవి కాలానికి సంబంధించి నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి తాగునీటి విడుదలపై ప్రధానంగా చర్చించారు. తెలంగాణకు నాగార్జునసాగర్ నుంచి 16 టీఎంసీలు, శ్రీశైలం నుంచి 5 టీఎంసీలు కలిపి మొత్తం 21 టీఎంసీల నీటిని కేటాయించగా.. ఏపీకి సాగర్ నుంచి 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ కేటాయింపులు ఆగస్టు 15 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది.
ఇప్పటికే ఇరు రాష్ట్రాలు కేఆర్ఎంబీకి లేఖ
కాగా.. ఇప్పటికే తాగునీటి అవసరాల కోసం నీటి కేటాయింపులు చేయాలని ఇరు రాష్ట్రాలు కేఆర్ఎంబీకి లేఖలు రాశాయి. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుంచి 5 టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి 13 టీఎంసీలు కేటాయించాలని కోరగా.. ఏపీ సాగర్ నుంచి 10 టీఎంసీలు విడుదల చేయాలని లేఖ రాసింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల వాదనలు విన్న కమిటీ, ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటి నిల్వలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంది. ఏపీ ఇప్పటికే తమకు కేటాయించిన పరిమితికి మించి నీటిని వినియోగించుకున్నదని.. ఇప్పుడు అదనపు కేటాయింపులు చేస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలంగాణ అధికారులు వాదించారు. అయినప్పటికీ తాగునీటి అవసరాలు అత్యవసరమైనవని కేఆర్ఎంబీ స్పష్టం చేసింది. ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని రెండు రాష్ట్రాలకు తగిన మేర నీటిని కేటాయించాలని నిర్ణయించింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నిల్వలను పరిగణనలోకి తీసుకొని తెలంగాణకు 5 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం కల్పించింది.
అలాగే నాగార్జునసాగర్‌లో సుమారు 26 టీఎంసీల వరకు నీటి లభ్యత ఉండటంతో తెలంగాణకు 16 టీఎంసీలు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ కోరిన మేరకు సాగర్ నుంచి 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ కేటాయింపులు ఆగస్టు 15 వరకు అమల్లో ఉండనున్నాయి. అనంతరం వర్షపాతం, వరదల పరిస్థితి, జలాశయాల్లోకి వచ్చే ప్రవాహాల ఆధారంగా మరోసారి సమీక్షించి కొత్త కేటాయింపులు నిర్ణయించనున్నట్లు కమిటీ వెల్లడించింది. మొత్తంగా ఈ సమావేశంలో తెలంగాణకు నాగార్జునసాగర్ నుంచి 16 టీఎంసీలు, శ్రీశైలం నుంచి 5 టీఎంసీలు కలిపి 21 టీఎంసీల నీరు కేటాయించగా, ఏపీకి నాగార్జునసాగర్ నుంచి 10 టీఎంసీల నీటిని కేటాయించారు. ఇదిలా ఉండగా, కృష్ణా జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్వహణ, భవిష్యత్ కేటాయింపులపై చర్చించేందుకు గురువారం కేఆర్ఎంబీ పూర్తిస్థాయి సమావేశం మరోసారి జరగనుంది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న పలు పెండింగ్ అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. ఈ త్రిసభ్య కమిటీ సమావేశంలో కేఆర్ఎంబీ సభ్యుడు సతీష్ కాంబోజు, తెలంగాణ ఈఎన్సీ రమేశ్‌బాబు, ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ కృష్ణమూర్తి పాల్గొన్నారు.






