రాష్ట్రంలో 11.54 లక్షల మెట్రిక్​ టన్నుల మొక్కజొన్న కొనుగోలు

by Kema Shiva Kumar |

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోళ్లు జోరందుకున్నాయి.

రాష్ట్రంలో 11.54 లక్షల మెట్రిక్​ టన్నుల మొక్కజొన్న కొనుగోలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మొక్కజొన్న ఉత్పత్తి 43.18 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేయగా, అందులో 21.59 లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేయవచ్చని భావిస్తోంది. జిల్లాల వారీగా మొత్తం 14.89 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలును లక్ష్యంగా నిర్ణయించింది. కొనుగోలు కోసం రాష్ట్రవ్యాప్తంగా 336 కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. బుధవారం వరకు 11.54 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు పూర్తి చేసి, 9.53 లక్షల మెట్రిక్ టన్నులను గోదాములకు తరలించారు. ఇంకా 2.01 లక్షల మెట్రిక్ టన్నులను గోదాములకు తరలించాల్సి ఉంది. కొనుగోళ్లలో ఖమ్మం జిల్లా ముందంజలో నిలిచింది. ఆ జిల్లాలో ఇప్పటివరకు 2.54 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. తర్వాతి స్థానాల్లో నాగర్‌కర్నూల్‌ (1.55 లక్షల మెట్రిక్ టన్నులు), వరంగల్‌ (1.11 లక్షల మెట్రిక్ టన్నులు), నిర్మల్‌ (1.05 లక్షల మెట్రిక్ టన్నులు) ఉన్నాయి.

ఇక నిల్వల విషయానికి వస్తే.. మొత్తం 15.53 లక్షల మెట్రిక్ టన్నుల స్టోరేజ్ సామర్థ్యం అవసరం ఉండగా, ప్రస్తుతం 12.75... లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ స్థలం అందుబాటులో ఉంది. ఎక్కడికక్కడే సరిపడే నిల్వ స్థలాలను గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఇందులో భాగంగా అదనంగా మరో 27 వేల మెట్రిక్​ టన్నుల నిల్వ స్థలాన్ని గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 2.48 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ స్థలాన్ని గుర్తించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మొక్కజొన్న కొనుగోళ్లకు 3.10 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం ఉండగా, ఇప్పటివరకు 2.42 కోట్ల బ్యాగులు సరఫరా అయ్యాయి. ఇంకా 67.84 లక్షల గన్నీ బ్యాగులను సర్దుబాటు చేయాల్సి ఉంది. ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, ఖమ్మం, కుమురం భీం ఆసిఫాబాద్‌, మహబూబ్‌నగర్‌, నిర్మల్‌ జిల్లాల్లో హమాలీల కొరత.. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో రవాణా సమస్యల వల్ల కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయి.

Next Story