111 జీవో ర‌ద్దే ల‌క్ష్యం.. ఉచిత విద్య‌, వైద్యమే టీఆర్ఎస్ ధ్యేయం

by Ratna Kumari |   (  Updated:2026-05-30 10:13:04  IST  )

తెలంగాణ ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడమే తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ ప్రధాన ధ్యేయమని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

111 జీవో ర‌ద్దే ల‌క్ష్యం.. ఉచిత విద్య‌, వైద్యమే టీఆర్ఎస్ ధ్యేయం
X

దిశ, మొయినాబాద్ : తెలంగాణ ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడమే తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ ప్రధాన ధ్యేయమని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. శనివారం మొయినాబాద్ చౌరస్తాలో పార్టీ జెండాను ఆవిష్కరించేందుకు విచ్చేసిన ఆమెకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రజలు ఆశించిన ఫలితాలు పూర్తిగా అందలేదని, తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన రాజకీయ ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చిందన్నారు. చేవెళ్ల, మొయినాబాద్ ప్రాంత ప్రజలకు అత్యంత కీలకమైన 111 జీవోను అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని కవిత హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో భూముల విలువలు భారీగా పెరిగినా జీవో కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతి, సామరస్యాన్ని కాపాడటంలో తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు.

యువతకు లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు.. స్వయం ఉపాధి కోసం రూ.2 లక్షల నుంచి భారీ స్థాయిలో ఎలాంటి గ్యారంటీ లేకుండా రుణాలు అందించే విధానాన్ని అమలు చేస్తామని కవిత వెల్లడించారు. మహిళల అభ్యున్నతి, ఆడబిడ్డల భవిష్యత్తు కోసం ప్రత్యేక కార్యాచరణ చేపడతామని చెప్పారు. కార్యక్రమానికి ముందు చిలుకూరు బాలాజీ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సురంగల్ గ్రామంలో తన సొంత ఖర్చుతో టీఆర్ఎస్ నాయకుడు గాండ్ల సంతోష్ కుమార్ నిర్మించనున్న బస్ షెల్టర్‌కు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో కుమ్మరి శివశంకర్, బేగరి రాజు, మహమ్మద్ అన్వర్ ఖాన్, షేక్ మహమ్మద్ నూర్ భాయ్, మేకగూడెం బిక్షపతి, సంగేరి నగేష్, కుమ్మరి జనార్దన్, బి.సురేందర్ రెడ్డి, గౌండ్ల సురేష్ గౌడ్, గౌరవ్ కుమార్ ప‌లువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story