- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్‌లో స్వర్ణ యుగానికి అడుగులు పడి 11 ఏళ్లు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
భారత్‌లో స్వర్ణ యుగానికి అడుగులు పడి 11 ఏళ్లు పూర్తవుతోందని, మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలోని అన్నిరంగాల్లో సమాన అభివృద్ధికి బాటలు పడ్డాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: భారత్‌లో స్వర్ణ యుగానికి అడుగులు పడి 11 ఏళ్లు పూర్తవుతోందని, మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలోని అన్నిరంగాల్లో సమాన అభివృద్ధికి బాటలు పడ్డాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలోని అన్ని వర్గాలకు సమానమైన న్యాయం జరగడంతోపాటుగా అంతర్జాతీయంగానూ దేశ ఖ్యాతి పెరిగింది. ఈ 11 ఏళ్లలో దేశంలో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేసి చూపించామని వెల్లడించారు. మంగళవారం మోడీ పాలనపై విజయవాడలో జరిగిన సమావేశంలో పలు విషయాలు వివరించారు. జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించామని, 2014లో 2.1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ నుంచి 4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేరుకుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ స్వయంగా వెల్లడించిందన్నారు. త్వరలోనే 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదిగే దిశగా మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు కృషిచేస్తోంది. దేశ వ్యాప్తంగా 81 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తున్నామని కరోనా సమయంలో ప్రారంభించి ఇప్పటివరకు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
4 కోట్ల మంది పేదలకు పక్కా ఇళ్లను అందించిన చరిత్ర ఎన్డీయే ప్రభుత్వానిదేనన్నారు. ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ను తీసుకొచ్చి రాష్ట్రాల సమస్యలకు శాస్త్రీయమైన పరిష్కారం అందించేందుకు సమగ్రమైన వ్యవస్థతో నీతి ఆయోగ్ రూపకల్పన చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం నల్లధనంపై యుద్ధం ప్రకటించిందని, ఇందులో భాగంగా పెద్ద నోట్ల రద్దు చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల్లో పలు సంస్కరణలు అమలు చేసిందన్నారు. అన్నదాతలు పండించిన పంటకు ఉత్పత్తి వ్యయం కన్నా 1.5 రెట్లు అధిక ధర దక్కేలా కనీస మద్దతు ధరను పెంచామని, 2014లో వరి క్వింటాలుకు రూ.1,310 ఉండగా 2024 ఖరీఫ్ నాటికి రూ.2,369కు పెరిగిందన్నారు. అదే విధంగా పత్తి మద్దతు ధర 2014లో రూ.3,700 ఉండగా 2025 నాటికి రూ.7,710కి పెంచామన్నారు. పీఎం కిసాన్ పథకం ప్రారంభించినప్పటి నుంచి 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.3.7 లక్షల కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏకంగా 3,310 లక్షల టన్నులకు పెరిగింది. అంతర్జాతీయంగా ఫెర్టిలైజర్ల ధరలు పెరుగుతున్నప్పటికీ రైతులకు అందుబాటు ధరల్లోనే ఎరువులను అందిస్తున్నామన్నారు.
దేశ భద్రతకు అధిక ప్రాధాన్యం..
దేశ భద్రతకు ప్రధాని మోడీ అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు శత్రుదేశాలతో పాటు, ప్రపంచ దేశాలకు రక్షణ రంగంలో మన సత్తాను చాటిచెప్పే విధంగా అభివృద్ధి చెందామని, 2016లో ఉరి క్యాంప్ పై ఉగ్రదాడి జరిగిన తర్వాత మన సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్ లోకి ప్రవేశించి సర్జికల్ స్ట్రయిక్స్ చేసి, పాక్ కు ముచ్చెమటలు పట్టించింది. 2019లో పుల్వామా దాడికి ప్రతీకారంగా బాలాకోట్‌లో ఎయిర్ స్ట్రైక్ చేసి, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది.
తాజాగా జరిగిన అత్యంత దారుణమైన పుల్వామా దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంలోకి వెళ్లి ఉగ్ర స్థావరాలను పేల్చి మన వాయుసేన శక్తియుక్తులను ప్రపంచానికి చాటి చెప్పామన్నారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించే దిశగా స్వదేశీ తయారీకి కేంద్ర సర్కారు ప్రోత్సాహాం అందించిందన్నారు. మేకిన్ ఇండియా ద్వారా దేశీయంగా ఉత్పత్తులు తయారు చేసి, ఎగుమతులు పెంచి మన ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టపరిచారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గత పదేళ్లలో భారీగా మెరుగుపడింది. యువతను వ్యాపారం దిశగా ప్రోత్సహించేందుకు స్టార్టప్‌లకు సహకారం అందించినట్లు, 2014లో 350 ఉన్న స్టార్టప్ ల సంఖ్య 2024 నాటికి 1.5 లక్షలకు చేరింది. జాతీయ విద్యా విధానం తీసుకొచ్చి దేశ విద్యా వ్యవస్థలో చరిత్రాత్మక మార్పులు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది.
ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద 2014లో 14.72 కోట్ల ఖాతాలు తెరవగా, 2025 నాటికి 54.58 కోట్ల ఖాతాలు తెరిచారు. ఈ ఖాతాల్లో రూ.2.46 లక్షల కోట్ల మేర డిపాజిట్ చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశంలోని 50 కోట్ల మంది పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాం. 75 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ‘ఆయుష్మాన్ భారత్’ పథకం పరిధిలోకి తీసుకొచ్చి.. ఉచితంగా వైద్య సేవలు అందించాలని ప్రధానమంత్రి సంకల్పించారు.
దీనికి అనుగుణంగానే ఆ వయోపరిమితి వాళ్లందరికీ వైద్యసేవలు ఫ్రీగా అందిస్తున్నామన్నారు. దేశంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు, మరుగుదొడ్లు నిర్మించేందుకు, పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ.95 వేల కోట్లు ఖర్చు చేశాం. ఆడపిల్లల సంఖ్యను పెంచి వారికి విద్యను చేరువ చేయాలనే సంకల్పంతో ‘బేటీ బచావో-బేటీ పఢావో’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. భారత్ నెట్ ద్వారా 2.6 లక్షల గ్రామ పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ అందించాం. అంతరిక్ష రంగంలోనూ భారతదేశం అప్రతిహత విజయాలను ఖాతాలో వేసుకుందన్నారు. తెలుగు మట్టిలో మాణిక్యాలకు ‘పద్మశ్రీ’, ‘పద్మ భూషణ్’ అవార్డులను కూడా ఎన్డీయే ప్రభుత్వం అందించిందని తెలిపారు.






