- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Traffic Issue : గంటలో 10 వేల సింగిల్ రైడర్లు.. ట్రాఫిక్‌పై పోలీసుల సర్వేలో కీలక విషయాలు
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఐటీ హబ్ ఏరియాలలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీపై మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఐటీ హబ్ ఏరియాలలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీపై మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్ పర్యవేక్షణలో సైబర్ టవర్స్ పరిసరాల్లో మార్నింగ్ పీక్ అవర్‌లో మాన్యువల్ సర్వే చేపట్టారు. ఈ మేరకు సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయం వివరాలు వెల్లడించింది. గురువారం చేపట్టిన సర్వేలో కేవలం ఒక గంట వ్యవధిలోనే రోడ్డుకు నాలుగు వైపులా కలిపి 10,138 మంది సింగిల్ రైడర్లు (వాహనంలో ఒక్కరే ప్రయాణించేవారు) ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. డబుల్ రైడర్లు కేవలం 3,584 మంది మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. సింగిల్ రైడర్లు 6,554 అధికంగా ఉండటం వల్ల రహదారులపై వాహనాల సంఖ్య అనూహ్యంగా పెరిగి తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లకు దారితీస్తోందని ఈ సర్వేలో స్పష్టమైనట్లు పేర్కొన్నారు. సర్వే నిర్వహించిన సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు ప్రజల ముందుకు తీసుకువచ్చారు.
ట్రాఫిక్ రహిత సైబరాబాద్ నిర్మాణం!
ఐటీ ఉద్యోగులు, సాధారణ పౌరులు తమ ప్రయాణాల్లో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా ట్రాఫిక్ రహిత సైబరాబాద్‌ను నిర్మించవచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ సర్వే కార్యక్రమంలో ట్రాఫిక్ ఏడీసీపీ-I హనుమంతరావు, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, మాదాపూర్ ఎస్‌హెచ్ఓ శ్రీధర్ కుమార్, ఆర్.ఐ శ్రీకాంత్, ఎస్ఐలు టీవీ రావు, రాములు సిబ్బంది పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.
పోలీసుల సూచనలు..
* సాధ్యమైనంత వరకు రైడ్ షేరింగ్ పద్ధతిని పాటించండి.
* సహోద్యోగులు లేదా స్నేహితులతో కలిసి కార్ పూలింగ్ చేయండి.
* మెట్రో, బస్సు వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వినియోగాన్ని పెంచండి.
* పీక్ అవర్స్‌లో అత్యవసరమైతే తప్ప వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించండి.
* పాఠశాల, కళాశాలల వాహనాలు నడిచే సమయాల్లో ప్రయాణించకుండా ముందస్తు ప్రణాళిక చేసుకోండి.






