CM రేవంత్‌కు 10వేల పోస్టుకార్డులు

by Gantepaka Srikanth |

మహిళలను మోసం చేస్తే కాంగ్రెస్‌ను మట్టికరిపిస్తామని.. మహిళల ఆగ్రహాన్ని చవి చూడకముందే హామీలు అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

CM రేవంత్‌కు 10వేల పోస్టుకార్డులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళలను మోసం చేస్తే కాంగ్రెస్‌ను మట్టికరిపిస్తామని.. మహిళల ఆగ్రహాన్ని చవి చూడకముందే హామీలు అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి సోమవారం కవిత పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 10 వేల పోస్టు కార్డులను సీఎం రేవంత్‌రెడ్డికి పంపించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీలోగా మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వడంతోపాటు అన్ని హామీలపై కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రకటన చేయకపోతే 10 వేల మంది మహిళలు 10 వేల గ్రామాల్లోకి వెళ్తారని, అన్ని గ్రామాల్లో మహిళలను కూడగట్టి లక్షలాది పోస్టు కార్డులను సోనియా గాంధీకి పంపిస్తారని తేల్చిచెప్పారు.

ఏ సోనియా గాంధీ పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ మహిళల ఓట్లు వేయించుకుందో.. అదే సోనియా గాంధీకి లక్షలాది పోస్టు కార్డులను పంపిస్తాం అని స్పష్టం చేశారు. మహిళల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదని, మహిళలతో ఆటలాడుతున్నారని, మభ్యపెట్టి మోసం చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వరంగల్‌లో ఏర్పాటు చేయనున్న విమానాశ్రయానికి రాణి రుద్రమాదేవీ పేరు పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ మాట్లాడక ముందే మహిళా బిల్లు కోసం తెలంగాణ జాగృతి ఢిల్లీలో ధర్నా చేసిందని గుర్తు చేశారు. మహిళా బిల్లు రావడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలుకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో మహిళల అంశాలపై ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న సీఎం ప్రకటనకు.. ఆయన ప్రారంభించిన పెట్రోల్ పంప్‌నకు పోలిక లేదని విమర్శించారు. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు పంపిణీ చేస్తామన్న హామీని అమలు చేయాలని, ఈ పథకాలన్నింటినీ మార్చి 8న ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వడ్డీ లేని రుణాలపైనా ప్రభుత్వం అందంగా అబద్ధాలు చెబుతున్నదని ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను ఎగ్గొట్టిందని ఆరోపించారు. వడ్డీ లేని రుణ పరిమితిని రూ.20 లక్షలకు పెంచాలని, అభయహస్తం నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కిట్ పంపిణీని నిలిపివేసి కాంగ్రెస్ పార్టీ మానవత్వాన్ని మంటకలిపిందని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని, మహిళలపై నేరాల శాతం 20 శాతం పెరిగిందని డీజీపీ వెల్లడించారని తెలిపారు. అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఢాంబికాలు పలుకుతున్నదని.. కానీ వాటిని కేసీఆర్ హయాంలోనే సృష్టించారని పేర్కొన్నారు.

Next Story