TG: లైసెన్స్‌డ్ సర్వేయర్ల కోసం 10 వేల దరఖాస్తులు.. ఐదు వేల మందికే అవకాశం

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-19 11:02:45  IST  )

రాష్ట్రంలో భూ ప‌రిపాల‌న‌ను మ‌రింత మెరుగుప‌ర‌చ‌డానికి, ఖ‌చ్చిత‌మైన భూ రికార్డుల‌ను రూపొందించ‌డం ద్వారా భూ వివాదాల‌కు శాశ్వత ప‌రిష్కారం చూపడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయ‌కత్వంలో ప్రభుత్వం ప‌ని చేస్తుంద‌ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు.

TG: లైసెన్స్‌డ్ సర్వేయర్ల కోసం 10 వేల దరఖాస్తులు.. ఐదు వేల మందికే అవకాశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భూ ప‌రిపాల‌న‌ను మ‌రింత మెరుగుప‌ర‌చ‌డానికి, ఖ‌చ్చిత‌మైన భూ రికార్డుల‌ను రూపొందించ‌డం ద్వారా భూ వివాదాల‌కు శాశ్వత ప‌రిష్కారం చూపడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయ‌కత్వంలో ప్రభుత్వం ప‌ని చేస్తుంద‌ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. భూ భార‌తి చ‌ట్టంలో రిజిస్ట్రేష‌న్ల ప్రక్రియకు భూమి సర్వే మ్యాపును జ‌త‌ప‌ర‌చ‌డం త‌ప్పనిస‌రి చేశామ‌న్నారు. ఈ విధానాన్ని వీలైనంత త్వర‌గా అమ‌ల్లోకి తీసుకురావ‌డానికి పెద్ద సంఖ్యలో స‌ర్వేయ‌ర్ల అవ‌స‌రాన్ని గుర్తించామన్నారు. 5 వేల మంది లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల నియామ‌కానికి ఈ నెల 17వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించ‌గా 10,031 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌ని తెలిపారు.

లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల నియామ‌కంపై సోమ‌వారం మంత్రి స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల శిక్షణ‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను వెంట‌నే పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ నెల 26వ తేదీ నుంచి గ‌చ్చిబౌలిలోని స‌ర్వే ట్రైనింగ్ అకాడ‌మి( TALIM) లో రెండు నెల‌ల పాటు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్లను తీసుకోవ‌డం వ‌ల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవ‌కాశాలు పెర‌గ‌డంతో పాటు భూ వివాదాల‌ను ప‌రిష్కరించాల‌న్న ప్రభుత్వ ఆశ‌యం నెర‌వేరుతుంద‌ని ఆశాభావం వ్యక్తం చేశారు.

డిజిటలైజేష‌న్ ఆఫ్ విలేజ్ మ్యాప్స్‌

టీజీ‌ఆర్‌ఏ‌సిసీ(తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్) ద్వారా సర్వే రికార్డులను (మ్యాపులు) డిజిటలైజేషన్ చేప‌డుత‌న్నామ‌ని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రయోగాత్మకంగా నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని లింగాల గ్రామం, జ‌గిత్యాల జిల్లా మాల్యాల మండ‌లంలోని త‌క్కల‌ప‌ల్లి, ఖ‌మ్మం జిల్లా క‌ల్లూరు మండ‌లంలోని పెద్దకోరుకొండి మూడు గ్రామాలలో ఈ ప్రక్రియను రెండు రోజుల్లో ప్రారంభించ‌బోతున్నామ‌న్నారు. తెలిపారు. ఈ డిజిటల్ మ్యాప్ లను ఎక్కడి నుంచైనా సులభంగా యాక్సెస్ చేయవచ్చని, మాన్యువల్ పద్ధతుల కంటే వేగంగా, తక్కువ ఖర్చుతో ఖచ్చితమైన సమాచారం పొందవచ్చన్నారు. డిజిటల్ మ్యాపింగ్ ద్వారా భూ క్షేత్రాల పరిమాణం, ఆకృతి వంటి వివరాలు ఖచ్చితంగా పొందవచ్చన్నారు. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెరగ‌డంతో పాటు మ్యుటేష‌న్ ప్రక్రియ వేగవంతమవుతుంద‌న్నారు. పునరుద్ధరణ, భద్రత డిజిటల్ రూపంలో భద్రంగా నిల్వ చేయవచ్చు. కాలానుగుణంగా అప్డేట్ చేయవచ్చునని మంత్రి వివ‌రించారు.

Next Story