పురపాలికల్లో ‘కళాజాతలు’

by Ajay Maddhiboyina |

తెలంగాణలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 100 రోజుల ప్రణాళిక ప్రాధాన్యత, దీని ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, అవగాహన కల్పించడానికి సాంస్కృతిక

పురపాలికల్లో ‘కళాజాతలు’
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 100 రోజుల ప్రణాళిక ప్రాధాన్యత, దీని ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, అవగాహన కల్పించడానికి సాంస్కృతిక సారథి కళాకారులతో ‘కళాజాతలు’ నిర్వహించాలని పురపాలకశాఖ నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల ప్రణాళికలో ప్రజలకు మెరుగైన సేవలందించడంతోపాటు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని పురపాలకశాఖ నిర్ణయించింది. తెలంగాణ రైజింగ్-2047 పేరుతో పట్టణ స్థానిక సంస్థల్లో అమలు చేసేందుకు జూన్ 2వ తేదీ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు 100 రోజుల ప్రణాళికను రూపొందించింది. పరిశుభ్రమైన, ఆరోగ్వవంతమైన, ఎలాంటి విపత్తులైనా ఎదుర్కొనేలా పట్టణ ప్రాంతాలను నిర్మించే దిశగా ప్రతిరోజూ ‘ఒక చర్చ-ఒక మార్పు’ అనే నినాదంతో ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకుంది. పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి ‘ప్రజలే ముందు’ అనే విధానంతో స్థిరమైన పట్టణాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించింది.

80 శాతం పారిశుధ్య కార్యక్రమాలే..

రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 100 రోజుల ప్రణాళికలో 80 శాతం వరకు పారిశుధ్యం, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలే ఉన్నాయి. చెత్త నిర్వహణ, తడి, పొడి చెత్తను వేరు చేయడం, డ్రెయినేజీ క్లీనింగ్ కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, బయోమైనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వర్షాకాలం కావడంతో అంటువ్యాధులు సైతం ప్రబలే అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటినీ ప్రజలకు ‘కళాజాతలు‘ ద్వారా వివరిస్తే తొందరగా అర్థమయ్యే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

20 మంది అధికారులు..

రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 100 రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి జాయింట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, మెప్మాలో అధికారులతో కలిసి 20 మంది జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అన్ని మున్సిపాలిటీలు కవరయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. దీంతోపాటు సోషల్ మీడియా, ఫీడ్ బ్యాక్ టీములను సైతం ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ అవరోధాలు ఉన్నాయి? ఎక్కడెక్కడ కార్యక్రమాలు సాఫీగా సాగుతున్నాయి? ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి ఏమైనా సలహాలు, సూచనలు చేస్తున్నారా? వాటిని అమలు చేసేందుకు అవకాశముందా? వంటి అంశాలను ఫీడ్ బ్యాక్ టీమ్ అందిస్తున్నదని అధికారులు చెబుతున్నారు.

కల్చరల్ డిపార్ట్ మెంట్‌తో..

మున్సిపాలిటీల్లో అవగాహన కల్పించడానికి సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలోని ‘కళాజాతలు’ను వినియోగించాలని పురపాలకశాఖ నిర్ణయించింది. ఈ విషయంపై కల్చరల్ డిపార్ట్ మెంట్ తో చర్చించాలని నిర్ణయించారు. ఎన్ని టీములు, ఏ జిల్లాల్లో పర్యటించాలనే అంశాలపై రెండు శాఖలు చర్చించుకొని రూట్ మ్యాప్ తయారు చేయాలని నిర్ణయించారు.

Next Story