- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లా కనెక్షన్లు ఆన్‌లైన్, ఆస్తిపన్ను.. లైసెన్స్ ఆదాయంలో వృద్ధి.. 100 రోజుల ప్రణాళిక సక్సెస్!
తెలంగాణలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రజలకు మెరుగైన సేవలందించడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని పురపాలక శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రజలకు మెరుగైన సేవలందించడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని పురపాలక శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ రైజింగ్-2047 పేరుతో పట్టణ స్థానిక సంస్థల్లో అమలు చేయనున్న జూన్ 2వ తేది నుంచి సెప్టెంబర్ 10వ తేది వరకు 100రోజుల ప్రణాళిక మంచి ఫలితాలిచ్చిందని పురపాలకశాఖ అధికారులు చెబుతున్నారు. పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన, ఏలాంటి విపత్తులైనా ఎదుర్కొనే విధంగా పట్టణ ప్రాంతాలను నిర్మించే దిశగా ప్రతిరోజు ‘ఒక చర్చ-ఒక మార్పు’ అనే నినాదంతో కార్యక్రమాలు నిర్వహించింది. పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి ‘ప్రజలే ముందు’ అనే విధానంతో స్థిరమైన పట్టణాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. సంక్షేమ కార్యక్రమాలతోపాటు ఆదాయ వనరులు సైతం పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు.
2 జూన్ నుంచి ఈనెల 4 వరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేది నుంచి ఈనెల 4వ తేది వరకు 100 రోజుల ప్రణాళిక ప్రాధాన్యత వివరిస్తూ సుమారు 40వేల మంది పట్టణ ప్రజలు 250 కిలోమీటర్ల ర్యాలీలు నిర్వహించారు. 27.09 ఇండ్లల్లో తడి, పొడి చెత్తను వేరు చేయడంతోపాటు ఇళ్లలోనే కంపోస్టింగ్ ఎరువును తయారు చేశారు. దీంతోపాటు ‘అమృత మిత్ర’ కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల్లోని 10,704 మంది మహిళలు 24,708 మొక్కలు నాటారు.
శానిటేషన్ వర్కర్లకు హెల్త్ క్యాంపులు…
రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పని చేస్తున్న శానిటేషన్ వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది కోసం హెల్త్ క్యాంపులు, మెడికల్ చెక్ కార్యక్రమాలు నిర్వహించారు. 155 క్యాంపుల ద్వారా 25,386 మంది కార్మికులకు మెడికల్ టెస్టులు చేశారు.
క్లీన్ అండ్ గ్రీన్…
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పురపాలక శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. అందులో భాగంగానే 18,351కిలోమీటర్ల వరద నీటి కాలువలు, నాలాలను క్లీన్ చేసింది. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రతలు, ముందస్తు చర్యల గురించి 15.02 ఇండ్లల్లో సర్వే నిర్వహించారు. 4,357 ఓవర్ హెడ్ ట్యాంకులను క్లీన్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
ఆదాయం పెంచేందుకు…
సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే పురపాలక శాఖ ఆదాయం పెంచుకునే మార్గాలపై దృష్టి సారించింది. కమర్షియల్ జాబితాలో ఉంటూ రెసిడెన్షియల్ జాబితాలో ఆస్తిపన్ను చెల్లిస్తున్న గుర్తించిన అధికారులను వాటిని కమర్షియల్ కేటగిరిలో ఆస్తి పన్ను చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో 9,484 ఇండ్లను రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్ కేటగిరికి మార్చడం ద్వారా రూ.12.71కోట్ల ఆస్తి పన్ను ఆదాయం పెరిగింది. దీంతోపాటు ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్న 11,140 సంస్థలను గుర్తించారు. వీటికి ట్రేడ్ లైసెన్స్ జారీ చేయడం ద్వారా రూ.5.92కోట్ల ఆదాయం వచ్చింది. 1.39లక్షల నల్లా కనెక్షన్లను ఆన్ లైన్ చేశారు. వీటి ద్వారా కూడా పురపాలకశాఖకు ఆదాయం సమకూరిందని అధికారులు చెబుతున్నారు.
2,430 కొత్త గ్రూపులు…
రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2,430 స్వయం సహాయక మహిళా సంఘాలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు 7,978 గ్రూపులకు రూ.1022.99కోట్ల రుణాలను అందజేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్స్ కూడా నిర్వహించారు. వీటి ద్వారా సంఘాలకు రూ.71.71 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు.






