2047 నాటికి జీఎస్డీపీలో 10 శాతం వాటా.. యువతకు ఉపాధి: మంత్రి జూపల్లి

by Ramesh Naini |

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం కీలకం కానుందని, 2047 నాటికి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో పర్యాటక రంగం వాటాను 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

2047 నాటికి జీఎస్డీపీలో 10 శాతం వాటా.. యువతకు ఉపాధి: మంత్రి జూపల్లి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం కీలకం కానుందని, 2047 నాటికి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో పర్యాటక రంగం వాటాను 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ 2047- గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా ‘తెలంగాణ అనుభవాలు-వారసత్వం, సంస్కృతి-ఫ్యూచర్ రెడీ టూరిజం’ అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖతో క‌లిసి జూప‌ల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2047 నాటికి 3 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని కేవలం సంఖ్యాత్మక సూచికగానే కాకుండా, రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి మార్గంగా అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా వనరులు తక్కువగా ఉన్న అనేక దేశాలు పర్యాటకాన్ని ప్రధాన ఇంజిన్‌గా చేసుకొని అద్భుతమైన ఆర్థిక పురోగతి సాధించాయని.. ఇక్కడా ఈ రంగానికి అపారమైన సామర్థ్యం ఉన్నదని చెప్పారు.

పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. హాస్పిటాలిటీ, హస్తకళలు, రవాణా రంగాల్లోని వేలాది ఎంఎస్‌ఎంఈలకు ఇది జీవనాధారమని తెలిపారు. తెలంగాణ పర్యాటక రంగాన్ని పునరుద్ధరించడానికి, ప్రచారం క‌ల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని.. కొత్త పర్యాటక విధానంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడానికి విస్తృత స్థాయి ప్రోత్సాహకాలు ఉన్నాయని తెలిపారు. పర్యాటకుల కోసం అత్యాధునిక మౌలిక సదుపాయాలు, భద్రత, వసతి సౌకర్యాలను కల్పించాల్సిన అవసరాన్ని చెప్పారు. లగ్జరీ నుంచి బడ్జెట్ వసతి వరకు ఏర్పాట్లు, సుదీర్ఘ ప్రయాణాలకు అనుకూలమైన రోడ్డు పక్కన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారిస్తామ‌ని పేర్కొన్నారు. నూతన పర్యాటక వెబ్‌సైట్ ద్వారా రవాణా, వసతి, భద్రత, ఆకర్షణల గురించి సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి వ‌ల్లూరు, అడిష‌న‌ల్ పీసీసీఎఫ్ సునీతా భ‌గ‌వ‌త్, నిథ‌మ్ డైరెక్టర్ వెంకటరమణ, ఎక్స్‌పీరియం చైర్మన్ రాందేవ్‌రావు, ఆపరేషన్స్, ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాత్‌వర్మ, రామోజీ ఫిల్మ్ సిటీ వైస్ ప్రెసిడెంట్ ఏవీ రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story