ఈ ఏడాది పాలిటెక్నిక్ లో కొత్తగా పది కోర్సులు

by Naga Rani Yarlagadda |

ఈ ఏడాది కొత్తగా పాలిటెక్నిక్ లో పది కొత్త కోర్సులను ప్రవేశపెట్టినట్లు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు.

ఈ ఏడాది పాలిటెక్నిక్ లో కొత్తగా పది కోర్సులు
X
  • మొత్తం 33,140 సీట్లు అందుబాటులో ఉన్నాయి
  • టీజీ పాలిసెట్-2026 మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
  • ఈ నెల 27 నుండి స్లాట్ బుకింగ్ ప్రారంభం
  • సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఎ. శ్రీదేవసేన

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ ఏడాది కొత్తగా పాలిటెక్నిక్ లో పది కొత్త కోర్సులను ప్రవేశపెట్టినట్లు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలోని కాలేజీ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో కొత్త కోర్సులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. తెలంగాణ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (టీజీ పాలిసెట్-2026) మొదటి విడత ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ రేపటి నుండి ప్రారంభమవుతుందని తెలిపారు. విద్యార్థులు మెరుగైన కాలేజీలు, కోర్సులలో సీట్లు పొందేందుకు వీలుగా ఎక్కువ సంఖ్యలో ఆప్షన్లను ఎంచుకోవాలని ఆమె సూచించారు. కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 70 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో రాష్ట్రంలోని అన్ని 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు సహాయ కేంద్రాలుగా అవకాశం కల్పించారు. వివరాల కోసం విద్యార్థులు https://tgpolycet.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. రాష్ట్రంలో మొత్తం 111 పాలిటెక్నిక్ కళాశాలల్లో 33,140 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో 59 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు కాలేజీల్లో 17,130 సాధారణ సీట్లు, 1,658 ఈడబ్లూఎస్ సీట్లు కలిపి మొత్తం 18,788 సీట్లు ఉన్నాయి. 52 ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 13,080 సాధారణ సీట్లు, 1,272 ఈడబ్లూఎస్ కలిపి మొత్తం 14,352 సీట్లు ఉన్నాయి.

ఈ ఏడాది కొత్తగా పది కొత్త కోర్సులు

ఈ ఏడాది పాలిటెక్నిక్‌లో 10 కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్ టెక్నాలజీ, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్, బయో-టెక్నాలజీ, సెమీ-కండక్టర్ టెక్నాలజీ, ఇంటీరియర్ డిజైన్, ల్యాండ్‌స్కేప్ డిజైన్‌తో పాటు సివిల్ ఇంజనీరింగ్‌లో బిల్డింగ్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్ అండ్ వాల్యుయేషన్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ వంటి కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు గతంలో ఉన్న 25 సాంప్రదాయ, ఆధునిక కోర్సులు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్ మొదలైనవి) యథావిధిగా కొనసాగుతాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించి సకాలంలో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకుని సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలని అధికారులు కోరారు.

షెడ్యూల్ వివరాలు

ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్: మే 27 నుండి 31 వరకు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్: మే 29 నుండి జూన్ 01 వరకు.

వెబ్ ఆప్షన్ల నమోదు: మే 29 నుండి జూన్ 03 వరకు.

తాత్కాలిక సీట్ల కేటాయింపు: జూన్ 06 న లేదా అంతకంటే ముందు.

Next Story