నేటి నుంచే అమల్లోకి కొత్త ధరలు.. సామాన్యులకు భారీ షాక్..!

by  |
Cm KCR 2
X

దిశ, తెలంగాణ బ్యూరో: నేటి నుంచి రాష్ట్రంలో భూముల ధరలు పెరగనున్నాయి. ప్రభుత్వం పెంచిన ధరలు ఎవరికి భారంగా కానున్నాయి? ఏ వర్గానికి వెసులుబాటు కలిగింది? ఇవే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వ్యవసాయ, వ్యవసాయేతర భూములను 30 నుంచి 50 శాతం మాత్రమే పెంచినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే ఉత్తర్వులో ప్రాంతాలను బట్టి హెచ్చింపు చేసినట్లుగా కూడా ప్రకటించారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతంపైనే పెనుభారాన్ని మోపారు. సంపన్న వర్గాలు ఉండే, కొనుగోలు చేసే ప్రాంతాల్లో మాత్రం కేవలం 20 శాతం మాత్రమే పెంచారు. అదే పల్లెల్లో తక్కువ ధరలు ఉన్నాయంటూ మూడింతలు చేసినవి కూడా ఉన్నాయి. ప్రధానంగా ఎకరం రూ.లక్షకు లోపు ఉన్న ప్రాంతాల్లో వాటిని 300 శాతం పెంచినట్లు రికార్డులు చెబుతున్నాయి.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలో హైటెక్​సిటీకి పక్కనే ఉండే రెవెన్యూ గ్రామాల్లో మాత్రం 20 శాతం మాత్రమే పెంపును పరిమితం చేశారు. ఇక్కడేమో బహిరంగ మార్కెట్‌లో రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు పలుకుతున్నాయి. ఇటీవల హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ నిర్వహించిన వేలం పాటల్లో కోకాపేట, ఖానామెట్​ పరిధిలోని ప్లాట్లకు ఏకంగా రూ.60.2 కోట్లు పలకడం విశేషం. ఓపెన్ ​మార్కెట్ ​ఆ మేరకు ధరలు పలుకుతున్నాయన్నది అధికారికంగా తెలిసింది. కానీ అక్కడి భూముల మార్కెట్​ విలువను మాత్రం రూ.10 కోట్లకు తక్కువకే ఖరారు చేశారు.

నల్లధనాన్ని కూడబెట్టుకున్న వారంతా ఆయా ప్రాంతాల్లో భూములను కొనుగోలు చేయడం రివాజు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి, గండిపేట, సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలాల్లో అత్యధిక విలువైన భూములు ఉన్నాయి. గజం ధర రూ. లక్షల్లో ఉంది. ఎకరం భూమి కొనుగోలు చేయాలంటే సామాన్యులెవరికైనా అసాధ్యం. కానీ అక్కడి మార్కెట్ బేసిక్ ​ధరలు మాత్రం గరిష్టంగా రూ.9.68 కోట్లకు పరిమితం చేశారు. కోకాపేట, పుప్పాలగూడ, ఖానామెట్.. ఈ ఊర్ల పేర్లు దేశంలోనే ప్రసిద్ధిగాంచినవి. ఇక్కడి భూములను ప్రభుత్వం నిర్వహించిన ఈ ఆక్షన్​లోనే అత్యధిక ధరలు పలికాయి. కానీ అక్కడి మార్కెట్​ విలువలు కూడా ఎకరానికి రూ. 2.28 కోట్ల నుంచి రూ.3.25 కోట్లకు మించలేదు. అలాంటి ప్రాంతాల్లో రెట్టింపు ధరలను ఖరారు చేయడం వల్ల నష్టమేమీ లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. వారికి ఆదాయపు పన్నుల నుంచి తప్పించుకునే అవకాశం లభించేది. ప్రభుత్వానికి కూడా పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరేది. కానీ ప్రభుత్వ నిర్ణయాల్లో మాత్రం గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లోనే ఎక్కువగా పెంచారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇల్లుకు రెట్టింపు బాదుడు

పెరిగిన మార్కెట్​ విలువలు, రిజిస్ట్రేషన్ ఫీజులతో ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి రెట్టింపు బాదుడు ఖాయంగా కనిపిస్తోంది. అటు భూమి ధరలు, రిజిస్ట్రేషన్ ​ఫీజులతో పాటు నిర్మాణాలకు కూడా ధరలు పెరిగాయి. ఇప్పటి దాకా ఇల్లు రిజిస్ట్రేషన్‌కు రూ. 70 వేలు దాటని రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 1.40 లక్షలకు చేరనుంది. ప్లాటు ధరల పెంపు, చ.అ. ధరలు భారంగా మారనున్నాయి. వ్యవసాయ భూముల ధరల పెంపులో అధికారులు ఎక్సర్​సైజ్ ​చేశారు. కానీ స్ట్రక్చరల్ ​ప్రాపర్టీస్ ​విషయంలో మాత్రం ఇష్టమొచ్చిన రీతిలో చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది కనిపించకుండా ప్రభుత్వం ఖజానాకు చేరుతున్న ఆదాయంగా కొందరు సబ్​రిజిస్ట్రార్లు చెబుతున్నారు.

లెక్క ఇదే

గతం

ఇంటి స్థలం: 100 చ.గ. ధర చ.గ.నికి రూ.5,0‌‌00
నిర్మాణం: 1000 చ.అ. ధర చ.అ.కు రూ.700
ఇంటి స్థలం విలువ: రూ.5 లక్షలు
నిర్మాణం విలువ: రూ.7 లక్షలు
మొత్తం విలువ: రూ.12 లక్షలు
రిజిస్ట్రేషన్​ఫీజు: రూ.72,000(6 శాతం లెక్కిస్తే)

ప్రస్తుతం

ఇంటి స్థలం: 100 చ.గ. ధర చ.గ.నికి రూ.7,500
నిర్మాణం: 1000 చ.అ. ధర చ.అ.కు రూ.1,100
ఇంటి స్థలం విలువ: రూ.7.50 లక్షలు
నిర్మాణం విలువ: రూ.11 లక్షలు
మొత్తం విలువ: రూ.18.50 లక్షలు
రిజిస్ట్రేషన్​ఫీజు: రూ.1,38,500(7.5 శాతం లెక్కిస్తే)

గతానికి, ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్​ఫీజు పెరుగుదల: రూ.66,500(90 శాతానికి పైగానే బాదుడన్న మాట..!)

నిర్మాణాల మార్కెట్​ కనిష్ట విలువలు(చ.అ.ల్లో)

నిర్మాణం పట్టణ గ్రామీణం
ఆర్సీసీ రూ.1100 రూ.900
నాన్​ఆర్సీసీ రూ.750 రూ.600
= పదేండ్లు పైబడి నిర్మాణాలకు 1 శాతం వంతున తగ్గుతుంది.

అత్యధికంగా భూముల ధరలు(రూ.లల్లో)

= రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని గఫూర్​నగర్, గుట్టలబేగంపేట, ఇజ్జత్​నగర్, ఖాజాగూడ, ఖానామెట్, మాదాపూర్, రాయదుర్గ్​పాన్​మక్తాల్లో ఎకరం ధర రూ.9.68 కోట్ల నుంచి రూ.12.58 కోట్లకు పెరిగింది.

= అందరికీ ఆసక్తిగొలిపే రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని కోకాపేటలో రూ.1.50 కోట్ల నుంచి రూ.1.95 కోట్లు, రూ.1.75 కోట్ల నుంచి రూ.2.28 కోట్లకు, పుప్పాలగూడలో రూ.2 కోట్ల నుంచి రూ.2.60 కోట్లకు, రూ.2.50 కోట్ల నుంచి రూ.3.25 కోట్లకు పరిమితం చేశారు.

= సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​లో ఎకరం ధర రూ.80 లక్షల నుంచి రూ.1.12 కోట్లు, రూ.1.45 కోట్ల నుంచి రూ.1.88 కోట్లు, పటాన్​చెరులో రూ.1.45 కోట్ల నుంచి రూ.1.88 కోట్లు, రామచంద్రాపురంలో రూ.1.54 కోట్ల నుంచి రూ.2.01 కోట్లు, తెల్లాపూర్​లో రూ.2.90 కోట్ల నుంచి రూ.3.77 కోట్లకు పెంచారు.



Next Story

Most Viewed