50 వేల ఉద్యోగాలు.. ఎన్నో సమస్యలు

259

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి ప్రకటనకు అనుగుణంగా 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎలా ఇవ్వాలనేదాని మీద ఉన్నతాధికారులు తీవ్రంగా చర్చలు జరుపుతున్నారు. లీగల్ చిక్కులు రాకుండా పాత, కొత్త జోనల్ వ్యవస్థలలో దేనిని ప్రామాణికంగా తీసుకోవాలో యోచిస్తున్నారు. వీలైనంత త్వరలో ఈ చిక్కుముడులు విప్పి తదనుగుణంగా నోటిఫికేషన్లు జారీ చేయాలని భావిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాత పరీక్షలలోనూ, నియామకాలలోనూ, రిజర్వేషన్లలోనూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలనుకుంటున్నారు.

ప్రభుత్వంలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 50 వేల ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. దీనికి విద్యార్థులు, నిరుద్యోగులు, యువతలో మిశ్రమ స్పందన వచ్చింది. మరోవైపు నియామకాల కోసం ప్రభుత్వ స్థాయిలో మాత్రం కసరత్తు మొదలైంది. ఏ ప్రాతిపదికన నోటిఫికేషన్ ఇవ్వాలి? ఎప్పుడు ఇవ్వాలి? ఎలాంటి స్పష్టత ఉండాలి? సందేహాల నివృత్తికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాల మీద ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. పాత జోనల్ వ్యవస్థ ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వాలా? లేక కొత్త జోనల్ ప్రకారం ఇవ్వాలా? అనే విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. లీగల్‌ చిక్కులకు ఆస్కారం లేకుండా వీలైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.

మార్పు కోరుతూ

నియామకాల విషయంలో ప్రభుత్వ విధానాల పట్ల యువతలో తీవ్ర నిరుత్సాహం, అసంతృప్తి ఉందని అధికార పార్టీ గ్రహించింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎదురైన పరిస్థితిని చక్కదిద్దుకోవాలని భావించింది. అందులో భాగంగా స్వయంగా ముఖ్యమంత్రే ఉద్యోగాల ప్రస్తావన తెచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సైతం ఒకే విడతలో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుందని ప్రకటించారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా ఈసారి సీఎం చెప్పినట్లుగా ఉద్యోగాల భర్తీ తప్పకుండా జరుగుతుందని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. యువతలో అనుమానాలు ఉన్నప్పటికీ, నోటిఫికేషన్ రాగానే దరఖాస్తు చేసుకోవడానికీ, అర్హత సాధించి ఉద్యోగం పొందేందుకు వీలుగా పుస్తకాలను తిరగేయడం మొదలుపెట్టారు.

దాని మీదనే ఆసక్తి

నోటిఫికేషన్‌ ఎలా వెలువడుతుంది అనేదానిపై యువత ఎక్కువ ఆసక్తి కనబరుస్తోంది. పాత జోనల్ వ్యవస్థ ప్రకారం పది పూర్వ జిల్లాల ప్రాతిపదికన ఆయా పోస్టులకు స్థానిక రిజర్వేషన్ ఉంటుంది. కొత్త జోనల్ వ్యవస్థలో 31 జిల్లాలు ఉన్నందున స్థానిక రిజర్వేషన్ 95% ఉంటుంది. వికారాబాద్ జిల్లా ఏ జోన్ పరిధిలోకి వస్తుందనే వివాదం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సూచించిన కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. గతంలోని రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ జరిగింది. ఇప్పుడు 33 జిల్లాలు అయినందున, కొత్తగా వచ్చిన రెండు జిల్లాలు ఏ జోన్‌లోకి వెళ్తాయనే సమస్య వచ్చిపడింది.

మూడేళ్ల గడువుందిగా

కొత్త జోనల్ వ్యవస్థ ఉనికిలోకి వచ్చినప్పటికీ ‘మూడేళ్ల గడువు’ అనే నిబంధనతో పాత జోనల్ వ్యవస్థనే అమలుచేసే వెసులుబాటు ఉందని సాదారణ పరిపాలనా విభాగం అధికారి ఒకరు వివరించారు. స్థానిక రిజర్వేషన్ విషయంలో మాత్రం పాత, కొత్త జోనల్ వ్యవస్థలకు మధ్య వ్యత్యాసం ఉంటుందని, విద్యార్థులపై అది చూపే ప్రభావం గురించి మాత్రం ప్రభుత్వం ఆలోచించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఆదేశం మేరకు పాత జోనల్ వ్యవస్థ ప్రాతిపదికనే భర్తీ ఉండొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొత్త జోనల్ వ్యవస్థతో జిల్లాల సంఖ్య విషయంలో చిక్కులు మాత్రమే కాక రాష్ట్రపతి సవరణ ఉత్తర్వులు 2018 ఆగస్టులో వచ్చినా ఇప్పటికీ దాని ప్రకారం పోస్టుల పునర్ వ్యవస్థీకరణ జరగలేదని, రెండేళ్లుగా కాని ఆ పని ఇప్పుడు వెంటనే అయిపోతుందన్న నమ్మకం లేదని అన్నారు. అది కాకుండా ఏ జోన్ కింద ఎన్ని పోస్టులు ఉన్నాయో నిర్ధారించి దాని ప్రకారం నోటిఫికేషన్ జారీ చేయడంలో సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.

త్వరలో టెట్, డీఎస్సీ

ముఖ్యమంత్రి ప్రకటించిన 50 వేల ఉద్యోగాలలో ఉపాధ్యాయ పోస్టులు కూడా ఉన్నాయి. ఇందుకోసం టెట్ నిర్వహించడం అనివార్యంగా మారింది. ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ వెలువడడానికి ముందే టెట్ ప్రకటన రావాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే సమయంలోనే టెట్‌కు సంబంధించిన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది కాబట్టి త్వరలోనే స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం నోటిఫికేషన్ విడుదల చేయవచ్చని సమాచారం.