రాష్ట్ర ఖజానా ఖాళీ.. గుత్తేదారుల గుబులు..!

by  |
రాష్ట్ర ఖజానా ఖాళీ.. గుత్తేదారుల గుబులు..!
X

రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది. అభివృద్ధి పనుల బిల్లులు నిలిచిపోయాయి. ఏడాదిన్నర నుంచి చెల్లింపులు లేకపోవడంతో కాంట్రాక్టర్లు పనులకు వెనుకాడుతున్నారు. టెండర్లు వేసేందుకు కూడా జంకుతున్నారు. ఉన్నతాధికారులు వారిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పనులు ఆగకుండా టెండర్లు వేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. బిల్లులు మాత్రం ఇప్పించలేకపోతున్నారు. ఇప్పటి వరకు రూ. రెండు కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉన్నా వినియోగించుకోలేకపోతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రగతిభవన్​ నుంచి ఆమోదం లేకుండా బిల్లులు చెల్లించరాదని గత ఏడాది డిసెంబర్​లోనే ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీంతో లక్ష రూపాయల బిల్లు మంజూరుకు కూడా ప్రగతిభవన్​కు పంపాల్సి వస్తోంది. అక్కడ నుంచి క్లియరెన్స్​ వస్తేనే బిల్లు పాసవుతోంది. ప్రగతిభవన్​కు తిరగలేక కాంట్రాక్టర్లు అష్టకష్టాలు పడుతున్నారు. పనులను నిలిపివేసేందుకు సిద్ధమవుతున్నారు. సాగునీటిపారుదల శాఖ, రోడ్లు, జీహెచ్​ఎంసీ, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్​ విభాగాలలో బిల్లులు పెండింగులో ఉన్నాయి. బిల్లులు చెల్లించరాదంటూ ప్రగతిభవన్​ నుంచి ఆదేశాలిచ్చారు. అనుమతి తీసుకున్న తర్వాతే విడుదల చేయాలని స్పష్టంగా సూచించారు. కాంట్రాక్టర్లకు ఏడాదిన్నర కిందనే టోకెన్లు జారీ చేసినా నగదు మాత్రం రావడం లేదు.

రూ. 19 వేల కోట్లు పెండింగ్​

ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 19 వేల కోట్ల బిల్లులు పెండింగు​లో ఉన్నాయి. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనుల కోసం అత్యవసరంగా రూ. రెండు వేల కోట్లు విడుదల చేయాలని సీఎం కేసీఆర్​ ఆదేశించినా అమలు కాలేదు. ఆర్థిక శాఖ నుంచి మౌనమే సమాధానమవుతోంది. దీంతో ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. నీటిపారుదల శాఖలో రూ. 14 వేల కోట్లు, ఆర్​అండ్​బీలో రూ. 1200 కోట్లు, జీహెచ్​ఎంసీ, మున్సిపాలిటీలలో రూ. 1000 కోట్లు, పంచాయతీరాజ్​లో రూ. 900 కోట్లు, మిషన్​ భగీరథ పనులకు సంబంధించిన రూ. 800 కోట్లు… ఇలా రూ. 19 వేల కోట్ల బిల్లులు బాకీ పడినట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రగతిభవన్​ నుంచి అనుమతి వస్తేనే రూపాయి అయినా చేతిలో పడుతోంది. కరోనా తర్వాత బిల్లులు వస్తాయని ఆశపడ్డారు. కానీ రావడం లేదు. టోకెన్లు పట్టుకుని ప్రగతిభవన్​కు వెళ్లడమేలా అనేదే అంతు చిక్కని ప్రశ్న. వాస్తవంగా ప్రగతిభవన్​ గేట్ల దగ్గరకు కూడా కాంట్రాక్టర్లను రానీయడం లేదు. ఇక లోపలకు వెళ్లి పైరవీ చేయించుకుని తీసుకోవడం కష్టమైన పనే.

అన్నా… ఇప్పించరాదే

కాంట్రాక్టర్లు మంత్రులు, కోటరీ చుట్టూ తిరుగుతున్నారు. ఎంతో కొంత కమీషన్​ తీసుకుని బిల్లులు ఇప్పించండి అంటూ మొర పెట్టుకుంటున్నారు. మహబూబ్​నగర్​ జిల్లాలోని ఓ రిజర్వాయరు పనులలో దాదాపు రూ. 500 కోట్లు బిల్లు పెండింగ్​ ఉంది. కాంట్రాక్టర్ టీఆర్​ఎస్​ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అయినప్పటికీ బిల్లు కోసం కోటరీని వేడుకుంటున్నాడు. 10 శాతం కమీషన్​ ఇస్తానని విన్నవించుకుంటున్నాడు. బిల్లు మాత్రం రావడం లేదు. టీఆర్ఎస్ పెద్ద లీడర్లు, ఎమ్మెల్యేలు, మంత్రుల వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. సాయం చేయాలని వేడుకుంటున్నారు. బిల్లుల కోసం నేరుగా ఆర్థిక శాఖ అధికారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోన్లు చేస్తే సమాధానం రావడం లేదు. ప్రగతి భవన్​ నుంచే చెప్పించాలని కరాఖండిగా చెప్పుతున్నారు.

మిత్తీలకే చాలడం లేదు

టెండర్లు వేసి దక్కించుకున్న పనులను సకాలంలో చేయకుంటే కాంట్రాక్టర్లను కారణంగా చూపిస్తూ జరిమానాలు విధిస్తున్నారు. దీంతో అప్పులు తెచ్చి పనులు చేస్తున్నారు. కానీ ఏండ్ల తరబడి బిల్లులు రాకపోవడంతో తెచ్చిన అప్పులకు మిత్తీకే లక్షలు చెల్లిస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్​లో మిషన్​ భగీరథ కాంట్రాక్టరు బిల్లుల కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జీహెచ్​ఎంసీ పరిధిలోని అల్వాల్​ కొంతమంది కాంట్రాక్టర్లు రెండు నెలల కిందట ఆందోళన చేశారు. కానీ బిల్లులు మాత్రం రావడం లేదు. ప్రగతిభవన్​లో తలుపులు తెరుచుకున్న ప్రజాప్రతినిధులకు మాత్రం ఎంతో కొంత బిల్లులు చెల్లిస్తున్నట్లు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల నిర్మాణ సంస్థలకు మాత్రం కోట్ల రూపాయల బిల్లులు విడుదల చేస్తున్నారు. దీనిపై అధికారులను నిలదీస్తే. ప్రగతిభవన్​ ఆదేశం అంటున్నారు. బడా కాంట్రాక్టర్లు, ప్రభుత్వానికి అండగా ఉండే కాంట్రాక్టర్లకు మాత్రమే కొంత మేరకు బిల్లులు వస్తున్నాయని, మిగిలిన వారికి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బిల్లులు ఇవ్వకుంటే ఎలా

రాష్ట్రంలో అభివృద్ధి పనులకు బిల్లులు ఇవ్వడం లేదు. పనులు చేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నాం. చాలాసార్లు అధికార్లకు మొరపెట్టుకుంటున్నా ఖజానాలో నిధులు లేవంటున్నారు. కాంట్రాక్టర్లకు ఇచ్చే బిల్లులనే ఆపేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో పనులు చేయడం కష్టమే. కాంట్రాక్ట్​ వృత్తిని మానేసుకునేందుకు చాలా మంది సిద్ధమయ్యారు. – మన్నె నర్సింహారెడ్డి, సామాజిక కార్యకర్త


Next Story

Most Viewed