అంకెల గారడీ.. ఆగమవుతోన్న రైతులు!

by  |
అంకెల గారడీ.. ఆగమవుతోన్న రైతులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ధీమా దక్కడం లేదు. అతివృష్టి లేదా అనావృష్టితో పంటలు కోల్పోయిన రైతన్నకు పరిహారం ఇచ్చేందుకు కేంద్రం ఫసల్ బీమా పథకాన్ని నిబంధనలతో ముడిపెట్టింది. పెంచిన భారంతో ఇటు వాటా చెల్లించలేక రాష్ట్ర ప్రభుత్వం తప్పుకుంది. మరోవైపు పంటలకు నష్టం జరిగితే ఇవ్వాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీని కూడా తెలంగాణ ప్రభుత్వం ఎత్తేసింది. 2014లో ఒకసారి సబ్సిడీని ఇచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో లక్షల ఎకరాలు నీట మునిగిన పంటలకు పరిహారం ఎలా ఇస్తారనేది అన్నదాతను వేధిస్తున్న ప్రశ్న.

ఇప్పుడెలా..?

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలను ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. దీన్ని ఆధారంగా కేంద్రం కిసాన్ నిధిని తీసుకువచ్చింది. కానీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఇప్పుడు ఎవరు ఆదుకుంటారనేది సందేహంగా మారింది. విపత్తులు సంభవిస్తే రైతులు మునగకుండా పంటల బీమా తప్పనిసరి. సాధారణంగా పంటల పెట్టుబడికే ఇబ్బందులు పడే రైతులు బీమా ప్రీమియాన్ని ప్రైవేటుగా చెల్లించే పరిస్థితి ఉండటం లేదు. ఈ పరిస్థితుల్లో వారికి ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన పెద్ద దిక్కుగా ఉండేది. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ మీద వానాకాలం పంటకు 2 శాతం, యాసంగి పంటకు 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం ప్రీమియాన్ని రైతులు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా చెల్లించాలనే నిబంధన ఉండేది.

కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించే 50 శాతాన్ని తగ్గించుకుంది. నీటి వసతి ఉన్న ప్రాంతంలో 25 శాతం, నీటి వసతి లేని ప్రాంతంలో 30 శాతం మాత్రమే ప్రీమియం రూపంలో చెల్లిస్తామని ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన వాటాను రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని ఆర్థిక భారాన్ని తగ్గించుకుంది. రైతుల వాటాధనం పోగా మిగిలిన ప్రీమియం చెల్లింపును ఆర్థిక భారంగా భావించిన తెలంగాణ ప్రభుత్వం ఫసల్‌ బీమా నుంచి బయటకు వచ్చింది. రైతుల తరఫున చెల్లించే ప్రీమియం వాటా ధనాన్ని ప్రభుత్వాలు ఆర్థిక భారంగా భావించాయి. 2018 లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ. 386.74 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇందులో రాష్ట్ర వాటా రూ.193 కోట్లు ఉంది. అలాగే 2019 ఖరీఫ్‌, రబీ సీజన్లకు కలిపి రూ.638.40 కోట్ల వాటా ధనం ఉండగా రాష్ట్ర వాటాగా ఉన్నరూ. 319 కోట్లు చెల్లించలేదు.

ముప్పు రానే వచ్చింది..

ఈ వానాకాలం పంటల సాగు గణనీయంగా పెరిగింది. కానీ రైతులకు ముప్పు ముంచుకొచ్చింది. భారీ వర్షాలతో మొత్తం 23.40 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. అక్టోబర్ నెలలో నాలుగు రోజులు కురిసిన వానలకు 7.35 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయని ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాసింది. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 23.40 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఈ నివేదికలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నా కాగితాలకే పరిమితమయ్యాయి.

పరిహారం ఎలా..?

పంటలు నష్టపోయిన రైతులకు పంటల బీమా పథకం లేదు. ఇటు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు. గతంలో ప్రభుత్వాలు పంటలు నష్టపోతే ఇన్‌పుట్ సబ్సిడీ అందించేది. కానీ తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీని ఎత్తేసినట్లే చేస్తోంది. దాదాపు రూ. 4600 కోట్లకుపైగా రైతులు పంట ఉత్పత్తులను నష్టపోయారు. నష్టపోయిన పంటలకు పరిహారం ఇస్తామనో, ఇవ్వమనో ఎలాంటి ప్రకటన ఇప్పటి వరకూ చేయలేదు. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకునేదెలా అనేది అంతుచిక్కకుండానే ఉంది.


Next Story

Most Viewed