కొలువులకు పాతర.. కేంద్ర బలగాలపై మనసు పారేసుకున్న సర్కార్..

184

ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలో తాత్సారం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. కేంద్ర బలగాల్లో పనిచేస్తున్న 285 మందిని ఎస్పీఎఫ్​కు డిప్యూటేషన్​ మీద పంపాలని కోరింది. ఈ మేరకు బీఎస్​ఎఫ్​ డీజీకి రాష్ట్ర డీజీపీ లేఖ రాశారు. 1993లో సమైక్య రాష్ట్రంలో జారీ అయిన వెసులుబాటు జీవో ప్రాతిపదికగానే ఈ లేఖ రాసినట్టు తెలిసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కొలువుల కోసం నిరుద్యోగులు ఆరాటపడుతూ ఉంటే కేంద్రం నుంచి పోలీసులను డిప్యూటేషన్ మీద తెచ్చుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సులో పనిచేయడానికి కేంద్ర (పారామిలిటరీ) పోలీసు బలగాల నుంచి డిప్యూటేషన్‌పై పంపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నది. జాబ్ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగ యువత కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా తన పనిని కానిచ్చేస్తున్నది. ఎస్పీఎఫ్ విభాగానికి జోనల్ విధానం వర్తించకపోవడంతో స్థానికులకే 95% కొలువులు అనే నిబంధన వర్తించడం లేదు. ఇప్పటికే ఎస్పీఎఫ్‌లో సుమారు 285 మంది పనిచేస్తున్నారు. మరో 175 మంది కోసం ఈ నెల 9న రిక్వెస్టు పెట్టినట్లు సమాచారం. సమైక్య రాష్ట్రంలోనే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సును ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగింది.

1991లో ఇందుకోసం ప్రత్యేకంగా చట్టమే చేశారు. దానిప్రకారం సాధారణ కానిస్టేబుల్ మొదలు సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయివరకు కేంద్ర పారా మిలిటరీ బలగాల నుంచి నిర్దిష్ట నిష్పత్తి ప్రకారం సిబ్బందిని రిక్రూట్ చేసుకోడానికి వెసులుబాటు కూడా ఉంది. 1993లో రూపొందించిన జీవో (నెం. 237) ప్రకారం రాష్ట్ర పోలీసు శాఖ 340 మందిని కేంద్ర పారా మిలిటరీ బలగాలైన బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్ తదితర విభాగాల నుంచి రిక్రూట్ చేసుకోడానికి, డిప్యూటేషన్‌పై సమకూర్చుకోడానికి వెసులుబాటు లభించింది.

ఆ తర్వాత 2013లో ప్రత్యేకంగా హోం (లీగల్-2) విభాగం ఎస్పీఎఫ్ సబార్డినేట్ రూల్స్‌కు సవరణలు చేసి డిప్యూటేషన్ మీద రాష్ట్ర ఎస్పీఎఫ్‌లోకి వచ్చే సంఖ్యను ఖరారు చేసింది. కానిస్టేబుల్ ర్యాంకు డిప్యూటేషన్‌కు 10%, హెడ్ కానిస్టేబుల్ ర్యాంకుకు 25%, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ర్యాంకుకు 25%, ఎస్ఐ ర్యాంకుకు 5% చొప్పున నిష్పత్తిని ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం ఎస్పీఎఫ్ సంఖ్యను 1,645గా ఖరారుచేసి ఈ నిష్పత్తి ప్రకారం లెక్కలు వేసి 285 మందిని కేంద్ర పోలీసు బలగాల నుంచి డిప్యూటేషన్ మీద తెచ్చుకోవాలని జాబితా తయారుచేసింది. ఇప్పుడు ఈ నిష్పత్తి ప్రకారమే మరో 175 మందిని పంపించాల్సిందిగా ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ఈ నెల 9వ తేదీన బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాశారు.

తొమ్మిది విడతల్లో నియామకాలు..

ఎస్పీఎఫ్ ఏర్పడిన తర్వాత మొత్తం తొమ్మిది విడతలుగా రిక్రూట్‌మెంట్ జరిగింది. 1994, 1998, 2000, 2007, 2010, 2011, 2013, 2018, 2020 బ్యాచ్‌లకు చెందిన వారు సుమారు 2 వేల మంది ప్రస్తుతం పనిచేస్తున్నట్టు ఆ శాఖ వర్గాల ద్వారా తెలిసింది. ఈ సంవత్సరం కొత్త బ్యాచ్‌ను రిక్రూట్ చేసుకోడానికి బదులుగా బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్ లాంటి విభాగాల నుంచి సుమారు 175 మందిని డిప్యూటేషన్ మీద తెప్పించుకోవాలనుకుంటున్నది. బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. తొమ్మిది బ్యాచ్‌ల వారీగా రిక్రూట్‌మెంట్ అయినా దాదాపు ఇరవై సంవత్సరాలుగా ప్రమోషన్లు మాత్రం డిప్యూటేషన్ల మీద వచ్చిన వారికే లభిస్తున్నాయన్న అసంతృప్తి స్థానిక ఉద్యోగులకు ఉన్నది.

ఇప్పటివరకు డిప్యూటేషన్ల మీద కేంద్ర పారా మిలిటరీ బలగాల నుంచి ఇద్దరు ఎస్ఐలు, 16 మంది ఏఎస్ఐలు, 103 మంది హెడ్ కానిస్టేబుళ్ళు, 164 మంది కానిస్టేబుళ్లు చేరారు. ఈ సంఖ్యకు అదనంగా మరి కొద్దిమందిని ఈ నాలుగు కేడర్ల స్థాయిలో డిప్యూటేషన్ మీద పంపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. తెలంగాణలో పోలీసు కొలువుల్లో చేరడానికి మానసికంగా, శారీరకంగా సర్వసన్నద్ధంగా యువత ఉన్నప్పటికీ కేంద్ర నుంచి డిప్యూటేషన్ మీద తెచ్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుండడంపై ప్రస్తుతం పనిచేస్తున్న ఎస్పీఎఫ్ సిబ్బందిలో తీవ్ర అసంతృప్తి ఉన్నది. ఎస్ఐ, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ లాంటి స్థాయిల్లో డిప్యూటేషన్ మీద వస్తే పదోన్నతులపై పెట్టుకున్న ఆశలు ఆవిరి అయినట్లే అనేది వారి భావన.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..