‘ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది’

by  |
‘ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది’
X

దిశ, తెలంగాణ బ్యూరో: వరంగల్‌లోని ఎంజీఎం, కరీంనగర్ సివిల్ ఆస్పత్రిలో తెలంగాణ ప్రభుత్వం కొవిడ్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన వార్డులు అధ్వాన్నంగా ఉన్నాయని, అసలు అవి కొవిడ్ వార్డులేనా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ఆస్పత్రులు చూస్తే ఎంతో బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత వేధిస్తోందని పేర్కొన్న ఆయన శోభారాణి అనే వైద్యురాలు, నలుగురు ల్యాబ్ టెక్నీషియన్లు మృతిచెందారన్నారు. దీంతో ఉన్న సిబ్బంది మీదే పని భారం పడుతోందన్నారు. ప్రభుత్వం వైద్య సిబ్బంది, పారా మెడికల్, ల్యాబ్ టెక్నీషియన్లు, పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది, పారిశుధ్య సిబ్బందికి ఇన్సెంటివ్స్ అందించాలని ఆయన ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు.

మానవతా దృక్పథంతో సేవలందించే వారి కుటుంబాలను ఆదుకోవాలని ఆయన పేర్కొన్నారు. తాము రాజకీయ కోణంలో విమర్శించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల సహకరిస్తామని తెలిపారు. తెలంగాణ సర్కార్ కొవిడ్ మరణాల సంఖ్య, బాధితుల సంఖ్యను తక్కువ చేసి చూపుతోందని ఆయన ఆరోపించారు. పీఎం కేర్స్ ఫండ్ నుంచి 100 వెంటిలేటర్లు కేంద్రం ఇచ్చినా వాటిని వినియోగించుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు, సర్జికల్ మాస్కులు కూడా అందుబాటులో లేవని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో రెమిడెసివర్ వ్యాక్సిన్, ఆక్సీజన్ కొరత తీవ్రంగా వేధిస్తోందని బండి సంజయ్ తెలిపారు. అయితే ప్రభుత్వం మాత్రం అన్నీ ఉన్నాయని అబద్ధాలు చెబుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందన్నారు. కొవిడ్ పేషెంట్లను కాపాడేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని అన్నారు.


Next Story

Most Viewed