తేజస్విని హత్య కేసులో కీలక మలుపు..

31

దిశ, వెబ్‌డెస్క్: బెజవాడ ప్రేమోన్మాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన దివ్య తేజస్విని హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తేజస్విని, నాగేంద్రబాబు రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వివాహం అనంతరం ఎవరి ఇంటికి వారు వెళ్లిపోగా, విషయం తెలుసుకున్న తేజస్విని తల్లిదండ్రులు కూతురిని మందలించారు. నాగేంద్రకు చెడు అలవాట్లు ఉన్నాయని కూతురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పేరెంట్స్ మాట విని తేజస్విని నాగేంద్రకు దూరంగా ఉంటూ వచ్చింది. హత్య జరగడానికి ముందు రోజు అమ్మాయి ఇంటి దగ్గర నాగేంద్ర గొడవకు దిగాడు. గంజాయి మత్తులోనే దివ్యను హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా వీరిద్దరీ వాట్సాప్ చాటింగ్ వెలుగులోకి రావడంతో ప్రేమ వ్యవహారం బట్టబయలైంది.

మా ఇద్దరికీ 13ఏళ్లుగా పరిచయం..

తేజస్విని హత్య చేయడానికి గల కారణాలను ఉన్మాది నాగేంద్ర మీడియాతో పంచుకున్నాడు. తేజస్వినికి తనతో 13ఏళ్లుగా పరిచయం ఉందని, ఏడాది కింట మంగళగిరిలో ఇద్దరం ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. అమ్మాయి తల్లిదండ్రులు కావాలనే మమ్మల్ని విడగొట్టారని, మా పెళ్లి వారికి ఇష్టంలేదని చెప్పుకొచ్చాడు.

పక్కా ‌ప్లాన్‌తోనే హత్య..

తన కూతురిని హత్యచేసిన ఉన్మాదితో తనకు ఎలాంటి సంబంధం లేదని దివ్య తేజస్వి తండ్రి మీడియాకు వివరించాడు. హత్య జరిగిన సమయంలో నేను ఆఫీసులో ఉన్నానని, అతడితో ఎప్పుడు మాట్లాడలేదని, వార్నింగ్ ఇచ్చానని వస్తున్న కథనాలు అవాస్తవం అన్నారు. అసలు నాగేంద్ర ఎక్కడ ఉంటాడో కూడా తెలీదని.. కావాలనే తన కూతురిపై వదంతులు సృష్టిస్తున్నాడని..నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన ఆరోపించాడు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన కూతురుపై నాగేంద్ర దాడి చేసి చంపాడని బాధిత తల్లి తెలిపింది. అంతకుముందు దారుణంగా హింసించాడని.. నేను కింద నుంచి పైకి వెళ్లేసరికే అంతా జరిగిపోయిందని తేజస్విని తల్లి వెల్లడించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తన కూతురిని కిరాతంగా హత్యచేసిన వాడిని విడిచిపెట్టొందని కోరింది.