AIతో ఉద్యోగాలన్నీ ఊడిపోతాయా..? ఓపెన్ ఏఐ బాస్ సామ్ ఆల్ట్‌మన్ సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు పూర్తిగా ఊడిపోతాయన్న భయాలపై ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

AIతో ఉద్యోగాలన్నీ ఊడిపోతాయా..? ఓపెన్ ఏఐ బాస్ సామ్ ఆల్ట్‌మన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో, భవిష్యత్తులో మానవ ఉద్యోగాల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందా అనే భయాలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే చాట్‌ జీపీటీ (Chat GPT) సృష్టికర్త, ఓపెన్ఏఐ (Open AI) సీఈవో సామ్ ఆల్ట్‌మన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఓ అంతర్జాతీయ చర్చా వేదికలో ఆయన మాట్లాడుతూ.. ఏఐ టెక్నాలజీతో ఉద్యోగాలు పోవని, కాకపోతే వాటి స్వరూపం మారుతుందని అన్నారు. చరిత్రలో ప్రతి కొత్త సాంకేతిక విప్లవం వచ్చినప్పుడు కొన్ని పాత రకాల ఉద్యోగాలు మాయమవడం సహజమని అన్నారు. ఏఐ‌తో కూడా కొన్ని సాధారణ పనులు చేసే ఉద్యోగాలపై ప్రభావం పడవచ్చని తెలిపారు.

ఏఐ (AI) అనేది మానవులను రీప్లేస్ చేసే వ్యవస్థ కాదని, అది మానవుల సామర్థ్యాన్ని వందల రెట్లు పెంచే అద్భుతమైన సాధనమని సామ్ ఆల్ట్‌మన్ పేర్కొన్నారు. దీంతో మనుషులు మరింత క్రియేటివిటీతో పనుల చేసేందుకు దృష్టి పెడతారని పేర్కొన్నారు. ఏఐ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఊహించని రీతిలో లక్షలాది కొత్త ఉద్యోగాలు, సరికొత్త కెరీర్ ఆప్షన్లు మార్కెట్లోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఏఐ విప్లవాన్ని తట్టుకుని నిలబడాలంటే పౌరులు తమ టెక్నికల్ స్కిల్స్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలని.. అలా చేసిన వారికి వారి కెరీర్‌లో తిరుగుండదని ఆల్ట్‌మన్ స్పష్టం చేశారు.

Next Story