Aliens: ఏలియన్స్ ఉన్నారు.. షాకింగ్ విషయం చెప్పిన శాస్త్రవేత్తలు

by Indraja |

అనంతమైన ఈ విశ్వంలో ఎన్నో నిగూడ రహస్యాలు దాగి ఉన్నాయి.

Aliens: ఏలియన్స్ ఉన్నారు.. షాకింగ్ విషయం చెప్పిన శాస్త్రవేత్తలు
X

దిశ వెబ్ డెస్క్: అనంతమైన ఈ విశ్వంలో ఎన్నో నిగూడ రహస్యాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా భూమి మీద జీవం ఉన్నట్టే ఇతర గ్రహాల్లోనూ జీవం ఉండే అవకాశం ఉందని కొందరు భావిస్తుంటే, ఉండే అవకాశమే లేదని మరికొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజంగానే గ్రహాంతరవాసులు ఉన్నారా..? ఉంటే ఎక్కడ ఉన్నారు..? ఎలా ఉంటారు..? అనే పలు ప్రశ్నలకి సమాధానం వెతికేందుకు స్వీడన్, భారతదేశం, US , UKలో ఉన్న అంతర్జాతీయ పరిశోధకుల బృందం పరిశోధనలను మొదలు పెట్టింది.

ఈ క్రమంలో గ్రహాంతర జీవుల ఉనికిని అంతర్జాతీయ పరిశోధకుల బృందం గుర్తించింది. వివరాల్లోకి వెళ్తే.. డైసన్ గోళం లేదా డైసన్ స్ఫియర్ అంటే నక్షత్రాల చుట్టూ అధునాతన నాగరికతలను నిర్మించగల ఊహాత్మక నిర్మాణాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. నక్షత్రం నుంచి వచ్చే శక్తిని గ్రహించి, ఆ శక్తిని ఒక సివిలైజేషన్ కార్యకలాపాలకు అందించడమే డైసన్ స్ఫియర్లు ఉద్దేశ్యం.

కాని భూమి మీద ఉన్న మనుషులు ఈ డైసన్ స్ఫియర్లను ఏర్పాటు చేయలేక పోతున్నారు. దీనితో మనుషుల కంటే ఆధునికతలో ముందున్న ఏలియన్స్ ఈ డైసన్ స్ఫియర్లను ఏర్పాటు చేసి ఉండొచ్చని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. డైసన్ స్ఫియర్లు సాధారణంగా ఇన్‌ఫ్రారెడ్ కాంతి రూపంలో ఉండే ఒక ప్రత్యేకమైన కాంతిని వెదజల్లుతాయి. ఆ కాంతిని భూమి నుంచి సైతం గుర్తించవచ్చు.

కాగా స్వీడన్, భారతదేశం, US , UKలో ఉన్న అంతర్జాతీయ పరిశోధకుల బృందం హెఫెస్టోస్ అనే ఒక ప్రాజెక్ట్‌పై కలిసి పని చేస్తోంది. కాగా ఈ ప్రాజెక్ట్‌‌లో భాగంగా టెలిస్కోప్‌లు అలానే వివిధ సర్వేల నుంచి సేకరించిన డేటాను పరిశీలిస్తూ, డైసన్ స్ఫియర్ ఉనికిని సూచించే ప్రత్యేకమైన ఇన్‌ఫ్రారెడ్ కాంతి కోసం పరిశోధనలు మొదలు పెట్టారు. ఈ పరిశోధన వారు డైసన్ స్ఫియర్‌కు సంబంధించిన 7 నక్షత్రాలను గుర్తించారు.

ఈ నక్షత్రాలు భూమి నుండి 900 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. కాగా ఈ నక్షత్రాలు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ఇన్‌ఫ్రారెడ్ కాంతి కిరణాలని విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నక్షత్రాల చుట్టూ డైసన్ స్ఫియర్లు ఉండే అవకాశం ఉండొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అసాధారణ ఇన్‌ఫ్రారెడ్ కాంతి కిరణాలను ఏలియన్స్ సృష్టించారా..? లేక సహజంగా ఏర్పడ్డాయా అనే దానిపై స్పష్టత లేదు.

Next Story