- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చాట్‌జీపీటీతో సీక్రెట్లు పంచుకుంటున్నారా? సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ షాకింగ్ విషయాలు వెల్లడి
ప్రముఖ టెక్ సంస్థ ఓపెన్ ఏఐ (OpenAI) తీసుకొచ్చిన చాట్ జీపీటీ ప్రస్తుతం నిత్య జీవితంలో భాగమైంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు దీన్ని వ్యక్తిగత, వృత్తిపరమైన అవసరాల కోసం వినియోగిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టెక్ సంస్థ ఓపెన్ ఏఐ (OpenAI) తీసుకొచ్చిన చాట్ జీపీటీ (ChatGPT)కి ప్రస్తుతం విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు దీన్ని వ్యక్తిగత, వృత్తిపరమైన అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (Artificial intelligence) సాయంతో పని చేసే ఈ చాట్‌బాట్‌లోనే ప్రతి చిన్న సందేహాన్నీ అడిగి తెలుసుకుంటున్నారు. దాన్నో ఫ్రెండ్‌లా భావించి మనసు విప్పి మాట్లాడుకుంటున్నారు. అయితే, ఈ అధునాతన చాట్‍బాట్‌పై సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ (CEO Sam Altman) షాకింగ్ విషయాలు వెల్లడించారు. యూజర్లు చాట్‌జీపీటీలో పంచుకునే సమాచారం రహస్యంగా ఉండదని స్పష్టం చేశారు. న్యాయస్థానాలు ఆదేశిస్తే, ఆ చాట్స్‌ను బయటపెట్టాల్సి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తాజాగా ఆయన ఓ కమెడియన్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల చాలామంది యూజర్లు తమ జీవితాల్లో జరిగే వ్యక్తిగత విషయాలను చాట్‌జీపీటీకి చెప్పేస్తున్నారని, కానీ, యూజర్లతో జరిపే వ్యక్తిగత సంభాషణలను భద్రంగా ఉంచే విషయంలో ఏఐ రంగం ఇంకా పురోగతి సాధించాల్సి ఉందన్నారు. ఓ డాక్టర్‌తోనో, న్యాయవాది లేదా థెరపిస్ట్‌తో జరిపిన సంభాషణకు ఉన్నంత గోప్యత ఏఐ చాట్‌లలో ఉండదని తేల్చి చెప్పేశారు. ఇక చాట్‌జీపీటీ ఫ్రీ, ప్లస్, ప్రొ అకౌంట్లలో యూజర్లు తమ చాట్స్‌ను డిలీట్ చేసినా, అవి 30 రోజుల పాటు సంస్థ సర్వర్లలో నిల్వ ఉంటాయని, ఆ తర్వాత పూర్తిగా తొలగించబడతాయని చెప్పారు. అయితే, న్యాయపరమైన సమస్యలు ఎదురైతే మాత్రం వాటిని అలాగే ఉంచుతామని ఆల్ట్‌మన్ తెలిపారు. ఎంటర్‌ప్రైజ్, ఎడ్యూకేషన్, జీరో డేటా రిటెన్షన్ ప్లాన్ వినియోగదారుల చాట్స్ మాత్రం పూర్తిగా తొలగించబడతాయని స్పష్టం చేశారు. అందువల్ల చాట్‌జీపీటీతో వ్యక్తిగత వివరాలు పంచుకునే విషయంలో పునరాలోచన చేయాలని యూజర్లకు సూచించారు.






