హైదరాబాద్ లో నాలుగేళ్లలోనే 80 శాతం ప్రాపర్టీ రేట్లు హైక్

by Shamantha N |   (  Updated:2025-06-17 10:15:38  IST  )

హైదరాబాద్ నగరంలో 2020 నుంచి నివాస గృహ ధరలు అత్యధికంగా పెరిగినట్లు గురుగ్రామ్ కు చెందిన ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా లింక్ డిన్ పోస్టులో తెలిపారు

హైదరాబాద్ లో నాలుగేళ్లలోనే 80 శాతం ప్రాపర్టీ రేట్లు హైక్
X

దిశ, బిజినెస్: హైదరాబాద్ నగరంలో 2020 నుంచి నివాస గృహ ధరలు అత్యధికంగా పెరిగినట్లు గురుగ్రామ్ కు చెందిన ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా లింక్ డిన్ పోస్టులో తెలిపారు. 2020 నుంచి మెట్రో నగరాల్లోని సగటు రెసిడెన్షియల్ ప్రాపర్టీ ధరల గణాంకాలను అహూజా విశ్లేషించారు. దేశ రాజధాని ఢిల్లీ, ప్రధాన ఐటీ నగరాలు గురుగ్రామ్, బెంగళూరు, ఆర్థిక రాజధాని ముంబయిలో కూడా ఇంతలా రేట్లు పెరగలేదని పేర్కొన్నారు. దేశంలో ప్రాపర్టీ మార్కెట్ లో అత్యుత్తమంగా హైదరాబాద్ నిలిచిందన్నారు. హైదరాబాద్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ రేట్లలో ఏకంగా 80 శాతం వృద్ధి కనిపించినట్లు తెలిపారు.

ఢిల్లీ, గురుగ్రామ్ కంటే ఇండ్ల ధరలు హైక్

అహూజా విశ్లేషణ ప్రకారం.. మొత్తం నగర స్థాయిలోని సగటు గృహధరల్లో ఒక్కో ప్రాపర్టీ మూడు రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ తర్వాత స్థానాల్లో నోయిడా (70% వృద్ధి), గురుగ్రామ్ (60%), ఢిల్లీ, బెంగళూరు రెండూ 45% గృహధర వృద్ధిని నమోదు చేశాయి. ముంబయిలో మాత్రం కేవలం 40% పెరుగుదల మాత్రమే నమోదైంది. ఈ గణాంకాలు ప్రధాన నగరాల్లో స్థిరాస్తి మార్కెట్ ధోరణుల్లో మార్పును తెలియజేస్తున్నాయి. పెట్టుబడిదారుల అభిరుచులు, ఆర్థిక పరిస్థితుల మార్పును సూచిస్తున్నాయి. మెట్రో నగరాల్లో గృహధరల సగటు అభివృద్ధి సుమారు 50%గా ఉండగా, చాలా నగరాల్లో ఈ స్థాయికి తక్కువగానే పెరిగాయి. ఈ నగరాలన్నీ సగటు పెరుగుదల కన్నా తక్కువే అని అహూజా చెప్పారు. హైదరాబాద్ లో ప్రాపర్టీల ధరల పెరుగుదలకు మూడు ప్రధాన కారణాలు పేర్కొన్నారు. గృహాల డిమాండ్ పెరుగుదల, వేగవంతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడులు రాక గృహధరల పెరుగుదలకు అనుకూల వాతావరణం కల్పించాయని తెలిపారు. భవిష్యత్తు పెట్టుబడులకు కీలక కేంద్రంగా ఈ మార్పు సహకరించనున్నట్లు పేర్కొన్నారు.

Next Story