స్పీడ్ పోస్టు సర్వీస్‌లో పెను మార్పులు

by Ajay Maddhiboyina |

పోస్టాఫీసు స్పీడ్ పోస్టు సర్వీస్ లో పెను మార్పులు తీసుకొచ్చింది. సర్వీస్ ఛార్జీలను పెంచింది. డెలివరీ విధానంలో కూడా మార్పులు చేసింది. ఓటీపీ, ఎస్ఎంఎస్ ద్వారా డెలివరీ చేసేందుకు సాంకేతిక పరిజ్నానాన్ని ఉపయోగించుకోనుంది. ఈ మార్పులు అక్టోబర్ 1నుంచి అమలులోకి రానున్నాయి.

స్పీడ్ పోస్టు సర్వీస్‌లో పెను మార్పులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పోస్టాఫీసు స్పీడ్ పోస్టు సర్వీస్ లో పెను మార్పులు తీసుకొచ్చింది. సర్వీస్ ఛార్జీలను పెంచింది. డెలివరీ విధానంలో కూడా మార్పులు చేసింది. ఓటీపీ, ఎస్ఎంఎస్ ద్వారా డెలివరీ చేసేందుకు సాంకేతిక పరిజ్నానాన్ని ఉపయోగించుకోనుంది. ఈ మార్పులు అక్టోబర్ 1నుంచి అమలులోకి రానున్నాయి. పోస్టల్ డిపార్ట్ మెంట్ 1986లో స్పీడ్ పోస్ట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. స్పీడ్ పోస్టు ద్వారా అందించే లెటర్లు, ఇతర సమాచారం పత్రాలును అందించడంలో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టినట్లు పోస్ట్‌ల శాఖ ప్రకటించింది. ప్రైవేట్ కొరియర్ కంపెనీలకు ధీటుగా పోస్టల్ డిపార్ట్ మెంట్ తన సేవలను అందిస్తోంది.

అందులో భాగంగా స్పీడ్ పోస్ట్ టారిఫ్‌లను చివరిసారిగా 2012 లో సవరించారు. తాజాగా పెరుగుతున్న ఖర్చులు, నిర్వహన భారం నుంచి వెసులుబాటు పొందేందుకు కొత్తగా సర్వీస్ ఛార్జీలను సవరించింది. స్పీడ్ పోస్ట్ (పత్రాలు/పార్శిల్‌లు) కోసం రిజిస్ట్రేషన్ అందుబాటులోకి తెచ్చారు. చిరునామాదారునికి లేదా వారి అధీకృత ప్రతినిధికి మాత్రమే డెలివరీ చేయనున్నారు. చిరునామాదారులు ఓటీపీని ధృవీకరించిన తర్వాత మాత్రమే స్పీడ్ పోస్టును డెలివరీ చేస్తారు. విద్యార్థులకు టారిఫ్‌పై10శాతం మినహాయింపు ఇవ్వనున్నారు. ఎస్ఎంఎస్ ద్వారా వినియోగదారులు డెలివరీ సంబంధిత సమాచారాన్ని చేరవేయనున్నారు. వినియోగదారులకు ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం కూడా అందించనున్నారు. రియల్ టైమ్ డెలివరీ అప్‌డేట్‌ను కూడా తెలుసుకోవచ్చు.

* కొత్త టారిఫ్ రేట్లు

పోస్టల్ శాఖ స్పీడ్ పోస్ట్ ఛార్జీలను సవరించింది. 1-50 గ్రాముల వరకు ఉన్న వస్తువులకు లోకల్ అయితే రూ.19, 2వేల కిలోమీటర్ల వరకు రూ.47 చొప్పునా వసూలు చేస్తారు. 51-250 గ్రాముల బరువున్న వస్తువులకు లోకల్ అయితే రూ.24. 200 కిలోమీటర్లకు వరకు రూ.59. 201-500 కిలోమీటర్ల వరకు రూ. 63. అలాగే 501-1000 కిలోమీటర్ల వరకు రూ.68. 1001-2 వేల కిలోమీటర్ల దూరం ఉంటే రూ.72 చొప్పునా చెల్లించాలి. 2వేల కిలోమీటర్ల పైన దూరం ఉంటే రూ.77 చొప్పునా చెల్లించాలి. 251-500 గ్రాముల వరకు బరువున్న వస్తువులకు స్థానిక(లోకల్)కు రూ.28. అలాగే 200 కిలోమీటర్ల వరకు రూ.70. 201- 500 కిలోమీటర్ల వరకు రూ.75. 501- 1000 కిలోమీటర్ల వరకు రూ.82 చొప్పునా వసూలు చేస్తారు. అలాగే రూ.1001- 2 వేల కిలోమీటర్ల దూరాలకు రూ. 86. 2వేల కిలోమీరట్ల కంటే ఎక్కువ దూరం ఉంటే రూ.93 చొప్పున ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా జీఎస్టీ వసూలు చేయనున్నారు.

Next Story