పిన్‌కోడ్‌లకు ఇక గుడ్ బై.. భవిష్యత్తు మొత్తం డిజిపిన్‌లపైనే!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-05 04:30:28  IST  )

సాధారణంగా మనం ఎవరి చిరునామా అడిగినా, పిన్‌కోడ్ తప్పనిసరిగా ఉంటుంది.

పిన్‌కోడ్‌లకు ఇక గుడ్ బై.. భవిష్యత్తు మొత్తం డిజిపిన్‌లపైనే!
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా ఎవరి చిరునామాకైనా (Address) పిన్‌కోడ్ (Pincode) తప్పనిసరిగా ఉంటుంది. కానీ, ఈ పిన్‌కోడ్‌లు పెద్దపెద్ద ప్రాంతాలను మాత్రమే సూచిస్తాయి. ఉదాహరణకు, ఒకే పిన్ కోడ్‌కి పలు వీధులు, వేలాది ఇల్లు, వ్యాపార స్థలాలు కూడా ఉండవచ్చు. అంటే, ఒక వ్యక్తి లేదా కుటుంబం నివసించే ఖచ్చితమైన స్థలాన్ని పిన్ కోడ్ ఆధారంగా గుర్తించడం కష్టం. అలాగే, గ్రామీణ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు వంటి చోట్ల ఎలాంటి ఫిజికల్ చిరునామా లేకపోవచ్చు కూడా. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం డిజిటల్ యుగానికి (Digital era) తగ్గట్లు ఓ వినూత్న ఆవిష్కరణను తీసుకువచ్చింది. ప్రతి ఇంటి స్థలాన్ని ఖచ్చితంగా గుర్తించేందుకు డిజిపిన్ (DIGIPIN) అనే డిజిటల్ చిరునామా వ్యవస్థను ప్రారంభించింది. ఇది సంప్రదాయ పిన్ కోడ్‌కు బదులుగా, ప్రతి ఇంటికీ ప్రత్యేకమైన 10 అక్షరాల డిజిటల్ అడ్రస్‌ను అందిస్తుంది. ఈ డిజిపిన్ వ్యవస్థ ద్వారా చిరునామాలు స్పష్టంగా లేకపోయినా, ఎక్కడ ఉన్నా సరే గ్రామమైనా, అడవుల మధ్య ఉన్న ప్రదేశమైనా ఖచ్చితమైన గుర్తింపు సాధ్యమవుతుంది. ఇది మన దేశపు డిజిటల్ అడ్రస్సింగ్ విధానంలో ఒక చారిత్రాత్మక మలుపుగా చెప్పవచ్చు.

డిజిపిన్ అంటే ఏమిటి?

డిజిపిన్ అనేది ఇండియన్ పోస్టు ఆఫీసు, ఐఐటీ హైదరాబాద్, ISROలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఓపెన్ సోర్స్ జియోకోడ్ అడ్రస్ వ్యవస్థ. దీని ప్రకారం, దేశం మొత్తం‌ను సుమారు 4 మీటర్ల × 4 మీటర్ల పరిమితి గల చిన్న చిన్న గ్రిడ్‌లుగా విభజించి, ప్రతి గ్రిడ్‌కు ప్రత్యేకమైన 10 అక్షరాల ఆల్ఫా-న్యూమరిక్ కోడ్‌ను కేటాయిస్తారు. ఈ కోడ్ GPS లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఆధారంగా రూపొందించబడుతుంది. దీనివల్ల మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, మీ ఖచ్చితమైన స్థలాన్ని డిజిపిన్ ద్వారా సులభంగా గుర్తించవచ్చు.

డిజిపిన్ ప్రయోజనాలు ఏంటి?

ఇళ్లు, స్థలాలను మరింత కచ్చితత్వంతో, వేగంగా గుర్తించేందుకు ఈ ప్రత్యేక డిజిటల్ ఐడీ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆన్‌లైన్ డోర్‌ డెలివరీ సేవలు మరింత సజావుగా, సమర్థవంతంగా అందించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుందని తెలుస్తోంది. అలాగే అత్యవసర సేవలలో GPS ఆధారంగా ఖచ్చితమైన స్థలానికి సేవలు వెంటనే చేరుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాలలో చిరునామా లేకున్నా, GPS ఆధారంగా ఆ ప్రాంతాన్ని గుర్తించగలుగుతుంది. ముఖ్యంగా అడ్రస్ డేటా చోరీ కాకుండా కాపాడుతోంది. స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో, కొన్ని ప్రైవేట్ సంస్థలు వ్యక్తుల అనుమతి లేకుండానే వారి చిరునామా సమాచారాన్ని సేకరించి దుర్వినియోగం చేస్తున్నాయి. దీన్ని అరికట్టేందుకు, దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) వ్యవస్థకు చిరునామాల్ని కూడా జోడించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

డిజిపిన్ ఎలా పొందాలి?

మీకు చెందిన డిజిపిన్ కోడ్‌ను తెలుసుకోవడానికి ఈ వెబ్‌సైట్‌కి వెళ్లండి https://dac.indiapost.gov.in/mydigipin/home ఇందులో మీరు మ్యాప్‌లో మీ ఇంటి స్థలాన్ని గుర్తించి, మీ డిజిపిన్‌ను జనరేట్ చేసుకోవచ్చు. ఇది ఉచితంగా అందుబాటులో ఉంది. డిజిపిన్ జనరేట్ చేయడానికి ఉపయోగించే కోడ్‌ను ప్రభుత్వం పబ్లిక్ డొమైన్‌లో ఉంచింది. దీనివల్ల ఇంటర్నెట్ లేకపోయినా డిజిపిన్‌ను జనరేట్ చేయడం సాధ్యమవుతుంది. అలాగే, ఇది పాత చిరునామాను తొలగింస్తుందనే అనుమానాలు అవసరం లేదు. ఈ డిజిపిన్ మీ పాత చిరునామాను రీప్లేస్ చేయదు. ఇది అదనపు డిజిటల్ చిరునామాగా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో సర్వీసులందించడంలో ఈ డిజిపిన్ ప్రధాన పాత్ర పోషించవచ్చు.

ఇక డిజిపిన్ ద్వారా భారతదేశంలో చిరునామా వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య, డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని మరింత బలపరచనుంది. భవిష్యత్తులో ఇదే ప్రతి ఇంటి కొత్త చిరునామా అవ్వబోతుంది. మీరు కూడా మీ డిజిపిన్‌ను జనరేట్ చేసుకొని, ఖచ్చితమైన చిరునామాతో ముందడుగు వేయండి.

Next Story