వాట్సప్‌, ఫేస్‌బుక్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్ స్కామ్స్‌కు చెక్ పెట్టేందుకు మెటా 'ఏఐ' అస్త్రం!

by Ramesh Naini |

ఫేస్‌బుక్, వాట్సప్‌, మెసెంజర్ యూజర్లను సైబర్ కేటుగాళ్ల బారి నుంచి కాపాడేందుకు అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్‌ను ప్రవేశపెట్టింది.

వాట్సప్‌, ఫేస్‌బుక్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్ స్కామ్స్‌కు చెక్ పెట్టేందుకు మెటా ఏఐ అస్త్రం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా వేదికలుగా సాగుతున్న ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు దిగ్గజ సంస్థ మెటా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్, వాట్సప్‌, మెసెంజర్ యూజర్లను సైబర్ కేటుగాళ్ల బారి నుంచి కాపాడేందుకు అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్‌ను ప్రవేశపెట్టింది. వేగంగా విస్తరిస్తున్న సైబర్ నేరాలను అరికట్టడంతో పాటు, యూజర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడమే లక్ష్యంగా ఈ సరికొత్త వ్యవస్థను రూపొందించినట్లు మెటా వెల్లడించింది. కేవలం ఒక్క సంకేతంపైనే ఆధారపడకుండా, ఒకే సమయంలో బహుళ అంశాలను విశ్లేషించి మోసగాళ్లను పసిగట్టే సామర్థ్యం ఈ ఏఐ సిస్టమ్‌కు ఉంది.

అనుమానాస్పద ఫ్రెండ్ రిక్వెస్ట్‌లపై నిఘా

ఇకపై ఫేస్‌బుక్‌లో వచ్చే ప్రతి ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను ఏఐ నిశితంగా గమనిస్తుంది. ఒకవేళ అవతలి వ్యక్తి ప్రొఫైల్‌లో మ్యూచువల్ ఫ్రెండ్స్ (సాధారణ స్నేహితులు) తక్కువగా ఉన్నా, లేదా వారి ప్రొఫైల్‌లో పేర్కొన్న దేశానికి, వారు పంపిన రిక్వెస్ట్‌కు పొంతన లేకపోయినా యూజర్లకు వెంటనే హెచ్చరికలు పంపిస్తుంది. ఆ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేయకముందే బ్లాక్ చేసేలా యూజర్లను అలర్ట్ చేస్తుంది.

అకౌంట్ లింకింగ్ సేఫ్టీ

అలాగే వాట్సప్ యూజర్లను బురిడీ కొట్టించి, వారి ఖాతాలను స్కామర్ల డివైజ్‌లకు లింక్ చేసే ప్రక్రియకు ఇకపై బ్రేక్ పడనుంది. అనుమానాస్పద డివైజ్‌లతో ఖాతాను లింక్ చేసే సమయంలో వాట్సప్ ముందస్తుగా హెచ్చరికలను జారీ చేస్తుంది. డేటా విశ్లేషణ ద్వారా ఫేక్ ప్రొఫైళ్లను, ఇంపర్సనేషన్ ఖాతాలను వేగంగా గుర్తించి తొలగించేలా చర్యలు చేపట్టింది.

Next Story