గూగుల్‌ను మరపిస్తోన్న చాట్‌జీపీటీ.. రోజుకి 250 కోట్ల ప్రాంప్ట్‌లు

by Yella Dhawani Reddy |

ఓపెన్‌ ఏఐకి చెందిన చాట్‌బాట్‌ (AI chatbot) చాట్‌జీపీటీ (ChatGPT) టెక్ ప్రపంచంలో దూసుకెళ్తోంది.

గూగుల్‌ను మరపిస్తోన్న చాట్‌జీపీటీ.. రోజుకి 250 కోట్ల ప్రాంప్ట్‌లు
X

దిశ, వెబ్ డెస్క్: ఓపెన్‌ఏఐకి చెందిన చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ (ChatGPT) టెక్‌ ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేస్తున్న ఈ చాట్‌బోట్‌ను ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్నారు. రోజువారీ సందేహాలు, సమాచారం, క్రియేటివ్ కంటెంట్, కోడింగ్, డేటా అనలిసిస్ తదితర అవసరాలకు వినియోగదారులు దీనిపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓపెన్‌ఏఐ సంస్థ యాక్సియోస్‌ పత్రికకు వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, చాట్‌జీపీటీ రోజుకు సగటున 250 కోట్ల ప్రాంప్ట్‌లను హ్యాండిల్‌ చేస్తోంది. ఇందులో ఒక్క అమెరికా నుంచే రోజుకు 3.3 కోట్ల ప్రాంప్ట్‌లు వస్తుండటం గమనార్హం. వార్షికంగా ఈ సంఖ్య 91 వేల కోట్లకు చేరుతుందని సంస్థ అంచనా వేసింది.

ఈ తాజా గణాంకాల ప్రకారం చాట్‌జీపీటీ వినియోగంలో భారీ వృద్ధి కనిపిస్తున్నా, గూగుల్‌తో పోలిస్తే ఇది ఇంకా వెనుకబడ్డట్టే కనిపిస్తోంది. గూగుల్‌లో వార్షికంగా సుమారు 5 లక్షల కోట్ల సెర్చ్‌లు జరుగుతున్నాయి. అయినప్పటికీ, చాట్‌జీపీటీ వృద్ధి రేటు గణనీయంగా ఉండటంతో, ఇది భవిష్యత్తులో గూగుల్‌కు గట్టి ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇక 2023 డిసెంబర్‌ నాటికి చాట్‌జీపీటీ వారానికి కేవలం 300 మిలియన్ యాక్టివ్ యూజర్లు మాత్రమే ఉండగా, మూడు నెలల వ్యవధిలోనే ఇది 500 మిలియన్లకు పెరిగింది. ఇందులో ఎక్కువ మంది ఉచిత వర్షన్ వినియోగదారులే కావడం విశేషం.

ఇటీవల కొన్ని నివేదికల ప్రకారం, ఓపెన్‌ఏఐ తన స్వంతంగా ఓ ఏఐ ఆధారిత వెబ్ బ్రౌజర్‌ను అభివృద్ధి చేస్తోందని సమాచారం. ఇది నేరుగా గూగుల్ క్రోమ్‌కు ప్రత్యామ్నాయంగా నిలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సంస్థ చాట్‌జీపీటీ ఏజెంట్‌ (ChatGPT Agent) పేరుతో ఓ ఫీచర్‌ను విడుదల చేసింది. దీని ద్వారా వినియోగదారుల పనులను ఆటోమేటెడ్‌గా నిర్వహించే సదుపాయం లభిస్తోంది. ఇమెయిల్స్, డేటా విశ్లేషణ, టాస్క్ ప్లానింగ్, కంటెంట్ తయారీ వంటి అనేక సేవల్ని ఇది తక్కువ సమయంలో పూర్తి చేస్తోంది.

Next Story