భారత్‌లో వేగంగా విస్తరిస్తోన్న యాపిల్.. ఈసారి స్టోర్ ఎక్కడంటే?

by Yella Dhawani Reddy |

అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ (Apple) భారత మార్కెట్‌పై దృష్టి పెంచింది.

భారత్‌లో వేగంగా విస్తరిస్తోన్న యాపిల్.. ఈసారి స్టోర్ ఎక్కడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ (Apple) భారత మార్కెట్‌పై దృష్టి పెంచింది. ఈ నేపథ్యంలోనే భారత్‌లో తయారీ, విక్రయ కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ముంబై, ఢిల్లీలో రిటైల్‌ స్టోర్లను ప్రారంభించిన యాపిల్‌ త్వరలోనే మూడో స్టోరును ప్రారంభించనుంది. ఇందుకోసం క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరును (Bangalore) ఎంచుకుంది. హెబ్బాల్‌లోని ఫీనిక్స్‌ మాల్‌లో (Phoenix mall) కొత్తగా స్టోరు ఏర్పాటు చేయనుంది.

కాగా, ముంబై, ఢిల్లీ స్టోర్లకు మంచి ఆదరణ వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక బెంగళూరు ఫీనిక్స్‌ మాల్‌ మొదటి అంతస్తులో 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో యాపిల్‌ మూడో స్టోర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ స్థలాన్ని యాపిల్ ప‌దేళ్ల పాటు లీజుకు తీసుకున్న‌ట్లు స‌మాచారం. అంటే.. రానున్న కొన్ని నెలల్లోనే ఈ స్టోరు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఢిల్లీలోని ఔట్‌లెట్‌ మాదిరిగానే బెంగళూరు స్టోర్‌ కూడా ఆధునిక సాంకేతికతతో, వినియోగదారులకు ప్రీమియం అనుభూతినిచ్చే విధంగా ఉండనుంది.

అయితే, ప్రపంచవ్యాప్తంగా యాపిల్‌ ఉత్పత్తులకు భారీగా డిమాండ్‌ ఏర్పడుతుంది. అందుకు అనుగుణంగా ఉత్పాదకతను పెంచేలా కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే భారత్‌లో వ్యాపార వృద్ధికి ఇంకా భారీ అవకాశాలున్నాయని యాపిల్‌ సీఈఓ టిమ్‌కుక్‌ తాజాగా వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా దేశంలో మరో నాలుగు రిటైల్‌ స్టోర్లు నెలకొల్పే యోచనలో ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవన్నీ పరిశీలిస్తే.. యాపిల్‌ గ్లోబల్‌ వ్యూహంలో భారత్‌ కీలకంగా మారినట్లు తెలుస్తోంది. విక్రయాలకు మాత్రమే కాకుండా ఉత్పత్తి కేంద్రంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది.

అయితే అమెరికాలో ఐఫోన్లు తయారుచేయనిపక్షంలో, యాపిల్‌ ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధిస్తానని డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి యాపిల్‌ను హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ సుంకాలు భారత్‌, వియత్నాం లాంటి దేశాల్లో యాపిల్‌ పెట్టుబడులను ఏవిధంగా ప్రభావితం చేస్తాయో చూడాలి.

Next Story