ఏఐ ప్రస్థానంలో కొత్త మలుపు.. ‘ఏజెంటిక్ ఏఐ’తో ముప్పు పొంచి ఉందా? సీపీ సజ్జనార్ హెచ్చరిక

by Ramesh Naini |

కృత్రిమ మేధ (AI) సాంకేతికత కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే స్థాయి నుంచి స్వయంగా నిర్ణయాలు తీసుకుని పనులు పూర్తి చేసే ‘ఏజెంటిక్ ఏఐ’ (Agentic AI) స్థాయికి చేరుకుందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.

ఏఐ ప్రస్థానంలో కొత్త మలుపు.. ‘ఏజెంటిక్ ఏఐ’తో ముప్పు పొంచి ఉందా? సీపీ సజ్జనార్ హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: కృత్రిమ మేధ (AI) సాంకేతికత కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే స్థాయి నుంచి స్వయంగా నిర్ణయాలు తీసుకుని పనులు పూర్తి చేసే ‘ఏజెంటిక్ ఏఐ’ (Agentic AI) స్థాయికి చేరుకుందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ పరిణామం అటు సౌకర్యాన్ని, ఇటు పెను సవాళ్లను విసురుతోందని ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.

ఏజెంటిక్ ఏఐ అంటే ఏమిటి?

సాధారణ చాట్‌బాట్‌లు మనం అడిగిన సమాచారాన్ని మాత్రమే అందిస్తాయి. కానీ, ఏజెంటిక్ ఏఐ ఒక అడుగు ముందుకు వేసి పనులను ఆచరణలో పెడుతుంది. ఉదాహరణకు బయట వాతావరణం బాగోలేదని గ్రహిస్తే, అది కేవలం ఆ విషయాన్ని చెప్పడమే కాకుండా.. స్వయంగా ఇంటి కిటికీలు మూసివేసి, ఏసీ ఉష్ణోగ్రతను మారుస్తుంది. బ్యాంకింగ్‌లో అనుమానాస్పద లావాదేవీలను గుర్తించి ఖాతాలను స్తంభింపజేయడం, ఆసుపత్రుల్లో రోగి పరిస్థితిని బట్టి మందుల డోసును మార్చడం వంటి పనులను కూడా ఇవి చేయగలవు.

పొంచి ఉన్న ప్రమాదాలు

మానవ ప్రమేయం లేకుండా ఈ డిజిటల్ ఏజెంట్లు స్వయంప్రతిపత్తితో పనిచేయడం వల్ల నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని సజ్జనార్ హెచ్చరించారు. స్టాక్ మార్కెట్ వంటి చోట్ల ఏఐ తీసుకునే ఒక చిన్న తప్పుడు నిర్ణయం క్షణాల్లో కోట్లాది రూపాయల నష్టానికి దారితీయవచ్చు. యజమాని ఇచ్చిన ఆదేశాలను అపార్థం చేసుకుని, లక్ష్య సాధన కోసం తప్పుడు మార్గాలను ఎంచుకునే ప్రమాదం ఉంది. నేరగాళ్లు ఈ ఏజెంట్ల ప్రవర్తనను నియంత్రించి విధ్వంసం సృష్టించే అవకాశం ఉంది.

నిపుణుల సూచనలు.. మనిషి నియంత్రణే కీలకం

ఈ అత్యాధునిక సాంకేతికతను అదుపులో ఉంచడానికి ‘ముక్కుతాడు’ మనిషి చేతిలోనే ఉండాలని సజ్జనార్ స్పష్టం చేశారు. ఇందుకోసం కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రతి ఏఐ ఏజెంట్‌కు ఒక ప్రత్యేక ఐడీ ఉండాలి. ఏజెంట్ ఏ ఫైల్‌ను యాక్సెస్ చేసింది? ఏ మార్పులు చేసింది? అనేది నిరంతరం పర్యవేక్షించాలి. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు మనిషి అనుమతి తప్పనిసరి చేసే నిబంధనలు ఉండాలి. "సాంకేతికతతో పనులు వేగవంతం కావడం ఎంత ముఖ్యమో, భద్రత అంతకంటే ముఖ్యం. ఆటోమేషన్ వేగాన్ని మనం తెలివిగా నియంత్రించకపోతే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి" అని సజ్జనార్ తన పోస్ట్‌లో హెచ్చరించారు.

Next Story