పల్లెల్లో వీకెండ్ వ్యవసాయం..

by  |
పల్లెల్లో వీకెండ్ వ్యవసాయం..
X

పర్యావరణం గురించి ఎప్పట్నుంచో ఎన్నో పాఠాలు వింటున్నాం. కానీ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి రోజువారీ అలవాట్లలో చిన్న మార్పులు చేసుకోమంటే మాత్రం మా వల్ల కాదని అంటుంటారు. అయితే కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆ అవకాశం ఒక విధంగా దొరికినట్లయ్యింది. కఠిన లాక్‌డౌన్ పాటించిన సమయంలో కాలుష్యం గణనీయ స్థాయిలో పడిపోయిన సంగతి తెలిసిందే. కానీ మళ్లీ కొద్దికొద్దిగా పెరుగుతోంది. అయితే ఈ లాక్‌డౌన్ కాలంలో చాలా మందికి పర్యావరణ పరిరక్షణ మీద ఒక ప్రాక్టికల్ అవగాహన వచ్చింది. అభివృద్ధి పేరుతో ప్రకృతి మాతకు హాని కలిగిస్తే ఏర్పడే పర్యవసనాల గురించి అర్థమైంది. అందుకే వారికి వారే స్వయంగా పర్యావరణాన్ని కాపాడటానికి ముందుకొస్తున్నారు. పిజ్జాలు, బర్గర్లు తిని కవర్లు బయటపడేసే టెకీలు ఇప్పుడు మారిపోయారు. ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ప్రకృతికి తమ వంతు సేవ చేద్దామని నిర్ణయించుకుంటున్నారు. దాదాపు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అందరూ ఇప్పుడు ఊర్లలో ఇంటి నుంచే పనిచేస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్‌లో ఉండే శని, ఆది వారాల్లో షికార్లు కొడుతూ తిరిగే ప్రోగ్రామ్ పెట్టుకునే వారు, కానీ ఊర్లలో ఏం చేయాలి? ఇప్పుడు కరోనా ఊర్లకు పాకింది కాబట్టి తిరిగే అవకాశం లేదు. అందుకే వ్యవసాయం చేస్తున్నారు.

వ్యవసాయం అంటే బయట కెమికల్ కలిపిన విత్తనాలు కొనుక్కొచ్చి, లాభాలు గడించాలనే ఆశతో ఫుల్‌టైమ్ రైతుగా మారిపోతున్నారని అనుకోవద్దు. ఎలాగూ ఫుల్‌టైమ్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వల్ల సరిపడినంత డబ్బులు వస్తున్నాయి, పైగా పెద్దగా ఖర్చులు కూడా లేవు. కాబట్టి వీకెండ్‌లో వ్యవసాయానికి సమయం కేటాయిస్తున్నారు. వారంలో ఐదు రోజులు కీబోర్డు మీద చేతులు ఆడించి వారాంతంలో కలుపు తీస్తున్నారు. తాము నాటిన విత్తనాలు పెరిగితే చూసి సంతోషిస్తున్నారు. ఆకుకూరలు ఎదిగితే కోసుకుని వండుకుంటున్నారు. సేంద్రీయ పద్ధతిలో ఎరువులు ఎలా తయారుచేయాలి? ఏ ఎరువులు ఏ చెట్లకు వేయాలి? అని యూట్యూబ్‌లో వెతుకుతున్నారు. తక్కువపడిన వస్తువులను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారు. రెగ్యులర్ వ్యవసాయానికి తమ టెకీ బ్రెయిన్ ఉపయోగించి వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. వీలైనంత మేరకు తమ కుటుంబ పోషణకు అవసరమైన పండ్లు, కూరలు, కాయలను వారే పండించుకుంటున్నారు.

ఎక్కడికెళ్లి ఏది కొనుక్కోవాలన్నా భయం కలుగుతున్న ఈ రోజుల్లో, ఏ వైపు నుంచి వైరస్ వస్తుందో తెలియని ఈ కాలంలో.. సేంద్రీయ కూరలకు, ఇంట్లో పెంచుకున్న కోళ్లకే టెకీలు ప్రాధాన్యత ఇస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా తమకున్న భూమిలో షెడ్ వేసుకుని అక్కడే ఉండి పనిచేసుకుంటూ, తమ పంటను కోతుల బారి నుంచి రక్షించుకుంటున్నారు. అంతేకాకుండా నాటుకోళ్లు, నాటు కుందేళ్లు, చీమ కోళ్ల పెంపకాన్ని చేపడుతున్నారు. ఒక చేతితో ల్యాప్‌టాప్ నొక్కుతూనే, మరో చేతితో చీడ పట్టిన ఆకులను తుంచేస్తున్నారు.

సిటీల్లో మిద్దె తోటలకు పెరిగిన ప్రాధాన్యత..

ఇక సిటీలో సొంత ఇళ్లు ఉండి, అక్కడే సెటిల్ అయిన వారు ఇంటిపంట, మిద్దెతోటలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఎలాగూ మిద్దెతోట పెట్టుకోవడానికి రెడీమేడ్‌గా అన్ని సమకూర్చే స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి, ఇది పెద్ద రిస్క్ ఏం కాదు. అపాయింట్‌మెంట్ బుక్ చేస్తే వాళ్లే వచ్చి అందుబాటులో ఉన్న స్థలాన్ని చూసి.. అక్కడ పట్టే మొక్కలు, కావాల్సిన విత్తనాల గురించి ఒక ఎస్టిమేషన్ వేస్తారు. తర్వాత అన్నీ వాళ్లే సమకూరుస్తారు. ఏదైనా చీడపీడలు వచ్చినా సపోర్ట్ అందిస్తారు. ఇక మనం చేయాల్సిందల్లా వాటికి రోజుకు రెండుసార్లు నీళ్లు పోయడం, కాసినపుడు కూరలు కోసుకోవడమే. అటు గ్రామాల్లో ఉన్న టెకీలు, ఇటు సిటీలో ఉన్న టెకీలను ఈ విషయంలో కచ్చితంగా మెచ్చుకుని తీరాలి. ఇంకా వర్షాకాలం కొద్దిరోజులు ఉంటుంది కాబట్టి ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే ఆలస్యం చేయకుండా ప్రకృతి వ్యవసాయం ప్రారంభించండి మరి!


Next Story

Most Viewed