ఉపాధ్యాయులపై కరోనా పిడుగు.. దిక్కుతోచని స్థితిలో కుటుంబాలు

by  |
corona attack teachers
X

దిశ, కరీంనగర్ సిటీ : ప్రభుత్వ ఉపాధ్యాయులపై కరోనా పంజా విసురుతూనే ఉంది. రెండు నెలల కిందట విద్యాసంస్థల ప్రారంభంతో మొదలైన వైరస్ వ్యాప్తి ఇంతితై వటుడింతై అన్నట్లు రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటికే వేలాది మంది కొవిడ్ బారిన పడి చికిత్స పొందగా, శ్వాస సమస్యలతో వందల సంఖ్యలో ఉపాధ్యాయులు మరణించారు. సుమారు 300 మందికి పైగా టీచర్లు మృతి చెందినట్లు సమాచారం. ఇంట్లోని వారిని కోల్పోవడంతో పలు కుటుంబాలు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో ఉపాధ్యాయ సంఘాల్లో ఆందోళన నెలకొంది. దీనికితోడు విద్యాసంస్థల పునఃప్రారంభంపై గత మార్చిలో ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయం తమ పాలిట శరాఘాతంగా మారిందని విమర్శిస్తున్నాయి.

గత 45 రోజులుగా ప్రతిరోజూ సగటున ఐదుగురు ఉపాధ్యాయులు మరణిస్తుండగా వారి కుటుంబాల్లో భయానక వాతావరణం నెలకొంది. విద్యాసంస్థలు మూసేసినా ఉపాధ్యాయులను పాఠశాలలకు రప్పించుకోవటంతో పాటు సాగర్ బై ఎలక్షన్లు, మున్సిపల్ ఎన్నికల విధులు అప్పగించి వారి ప్రాణాల మీదకు తెచ్చారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. కరోనాతో మరణించిన వారిలో 200 మంది దాకా సర్వీసులో ఉన్నవారే. వీరిలో అత్యధికులు 40ఏళ్ల లోపు వారే ఉండటం గమనార్హం. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 32 మంది వరకు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలోనే అత్యధిక మరణాలు సంభవించాయి. 21 మంది ఇన్ సర్వీస్ టీచర్లు, 8 మంది రిటైర్డ్ టీచర్లు కరోనా బారిన పడి మృత్యువాతపడ్డారు. చికిత్స కోసం స్థానిక ప్రైవేటు, కార్పోరేట్ హాస్పిటల్స్‌లో చేరి రూ.లక్షలు ఖర్చు చేసినప్పటికీ ప్రాణాలు దక్కకపోగా కుటుంబాలు అప్పుల పాలయ్యాయి.

కెజీబీవీ కాంట్రాక్టు ఉపాధ్యాయులకైతే ఏ ఆసరా లేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కరోనా చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రుల్లో నాలుగు నుండి ఇరవై లక్షలు ఖర్చవుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం లక్ష రూపాయలు మాత్రమే రిఫండ్ చేస్తోందని, రిఫరల్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తుందని సంఘాల నేతలు పేర్కొంటున్నారు. చికిత్సకు అనుమతించిన ఆసుపత్రులన్నీ రిఫరల్ ఆసుపత్రులు కాకపోవడంతో ప్రభుత్వం అందించే లక్ష రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేకపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయుల కొవిడ్ మరణాలపై ప్రత్యేక దృష్టి సారించి నివారణ చర్యలు చేపట్టాలని, వ్యాక్సినేషన్‌లో ఉపాధ్యాయులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.



Next Story