విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసిన టీడీపీ.. నీ పెత్తనమేంటంటూ…

by  |
విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసిన టీడీపీ.. నీ పెత్తనమేంటంటూ…
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్‌2 ఎంపీ విజయసాయిరెడ్డేనని ఆ పార్టీ నేతలు అంటూ ఉంటారు. ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ విజయసాయిరెడ్డి కీలకంగా మారారు. విజయసాయిరెడ్డి 2019 ఎన్నికలకు ముందే విశాఖపట్నంలో తిష్టవేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డిని విశాఖ నుంచి పంపించేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించడంతో ఎంపీ విజయసాయిరెడ్డి ఇక విశాఖకే పరిమితమయ్యారు. విశాఖను తన అడ్డాగా చేసుకుని రాజకీయం చేస్తున్నారు.

విశాఖ పరిపాలనా రాజధానిగా ప్రకటించడంలో విజయసాయిరెడ్డి పాత్ర ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా విజయసాయిరెడ్డి మాత్రం విశాఖను వదల్లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల వెంటే ఉందని ప్రజల్లోకి చొచ్చుకెళ్లేలా ప్రయత్నించారు. అనంతరం జరిగిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికలను ఒంటి చేత్తో నడిపించారు. పార్టీ విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. ఇలా విశాఖలో తనకు ఎదురులేకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన విజయసాయిరెడ్డి విశాఖకు వచ్చి ఉత్తరాంధ్ర రాజకీయాలు ఏలడంపై అక్కడి నేతలు గుర్రుగా ఉన్నారు.

ఇకపోతే విజయసాయిరెడ్డిపై ఉత్తరాంధ్ర టీడీపీకి చెందిన కీలక నేతలు మండిపడుతున్నారు. ఉత్తరాంధ్రపై ఆయన పెత్తనమేంటంటూ టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు నారా లోకేశ్, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, బండారు సత్యనారాయణ మూర్తి, వంగలపూడి అనితలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు విశాఖను మరో పులివెందుల చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ధ్వజమెత్తుతున్నారు.

విశాఖలోని భూములు కబ్జా చేసేందుకే విజయసాయిరెడ్డి ఇక్కడ తిష్టవేశారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయినప్పటికీ విజయసాయిరెడ్డి మాత్రం తన పని తనదేనంటూ రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. మరోవైపు తెలుగుతమ్ముళ్లు సైతం విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ విమర్శ ప్రతివిమర్శలతో విశాఖ రాజకీయాలు హాట్ హాట్‌గా ఉంటున్నాయి.


Next Story

Most Viewed