టీడీఎల్పీ విలీనం.. తెలంగాణలో టీడీపీ శకం ముగిసినట్టేనా..?

203

దిశ,వెబ్‌డెస్క్ : ఉమ్మడి ఏపీలో ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రం అవతరించాక ఆ పార్టీ కార్యకలాపాలు ఏపీకే పరిమితమయ్యాయి. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి రాగా, తెలంగాణలో ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పూర్తిగా ఏపీ రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో తెలంగాణలో ఆ పార్టీకి గడ్డుకాలం వచ్చింది. ఒకప్పుడు బలంగా ఉన్న కేడర్ అంతా గులాబీ కండువాలు కప్పుకోవడం, లీడర్లు అంతా కారు ఎక్కడంతో ఆ పార్టీ రాష్ట్రంలో ఆల్‌మోస్ట్ బిచానా సర్దేసిందని చెప్పుకోవచ్చు. అప్పుడప్పుడు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి చంద్రబాబు ప్రయత్నించినా అది వర్కౌట్ కాలేదు.

2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావడం, 2019లో ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవం చెందడంతో ఆ పార్టీ భవిష్యత్ అంధకారంలా మారింది. 2014లో 100కు పైగా స్థానాలు సాధించిన టీడీపీ 2019లో కేవలం 24 ఎమ్మెల్యే స్థానాలకే పరిమితం అవ్వడంతో ఆ ఎఫెక్ట్ తెలంగాణ టీడీపీపై కూడా పడిందని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ మళ్లీ పుంజుకుంటుందని అధ్యక్షుడు చంద్రబాబు కేడర్‌ను ఉత్తేజ పరిచేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా.. పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. మొన్న జరిగిన లోకల్ పోరులోనూ టీడీపీని అధికార వైసీపీ కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. మునిగిపోయే నావలో ఎన్నిరోజులు ప్రయాణించినా ఏం ప్రయోజనం లేదనుకున్నారేమో తెలంగాణ తెలుగు తమ్ముళ్లు ఎట్టకేలకు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఏపీలో వరుస ఓటములు చవిచూస్తున్న టీడీపీకి తెలంగాణలో ఇక ఆదరణ ఉండదేమో అని అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే తెలంగాణ టీడీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర నేతలు నిర్ణయించారు. అందుకు సంబంధించి తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌కు లేఖను కూడా అందజేశారు. ప్రస్తుతం అసెంబ్లీలో టీడీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు ఎమ్మెల్యేలు మచ్చా నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య బుధవారం స్పీకర్‌ను కలిసి ఈ విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..