పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గించలేం..

by  |
పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గించలేం..
X

న్యూఢిల్లీ: చమురు ధరల పెంపు కేంద్రానికి ధర్మ సంకటంగా మారిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య పౌరులకు పెను భారంగా మారాయనీ ఒప్పుకున్నారు. దీనికి కేంద్రాన్నే నిందించడం సరికాదని, రాష్ట్ర ప్రభుత్వాలకు వీటి నుంచి ఆదాయం సమకూరుతున్నదని అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై కేవలం కేంద్ర ప్రభుత్వమే డ్యూటీలు విధించడం లేదని, రాష్ట్రాలు కూడా వసూలు చేస్తున్నాయని తెలిపారు. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం, రాష్ట్రాలకు ఆదాయం వస్తున్నదని, కేంద్రం వసూలు చేసిన పన్నుల నుంచి 41శాతం తిరిగి రాష్ట్రాలకు వెళ్తున్నదని వివరించారు. కాబట్టి ఇంధన ధరలపై పన్ను తగ్గింపు కేవలం కేంద్రానికి పరిమితం చేయరాదని అన్నారు. చమురు పన్ను తగ్గింపులపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చర్చించాలని అభిప్రాయపడుతున్నట్టు విలేకరుల సమావేశంలో వివరించారు. అలాగే, కరోనా కారణంగా నష్టపోయిన ఆదాయాన్ని రాబట్టుకోవాల్సి ఉన్నదని, ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్‌పై పన్నులను తగ్గించడం కష్టతరమేనని పేర్కొన్నారు. ప్రస్తుతం పెట్రోల్‌పై రిటైల్ రేట్‌లో 60శాతం పన్నులను కేంద్ర, రాష్ట్రాలు వసూలు చేస్తున్నాయి. డీజిల్‌పై దాదాపు 56శాతం విధిస్తున్నాయి. దీంతో రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ రికార్డుస్థాయిలో రూ. 100ను దాటాయి.

జీఎస్టీ పరిధిలోకి తెస్తారా?

లీటర్ పెట్రోల్ ధర కొన్ని చోట్ల సెంచరీ దాటడంతో పన్ను తగ్గింపులపై పలు విశ్లేషణలు వచ్చాయి. చమురునూ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న ఆలోచనలూ వచ్చాయి. తద్వారా దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ ధర రూ. 75కి చేరుతుందని ఆర్థికవేత్తలు ఇటీవలే అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే చమురు ఇంధనాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తారా? అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను విలేకరులు అడిగారు. అది జీఎస్టీ మండలి పరిధిలోని అంశమని సమాధానమిచ్చారు. జీఎస్టీ కౌన్సిల్ ఈ అంశాన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ ప్రకటన వెలువడవచ్చునని వివరించారు. జీఎస్టీ పరిధిలోకి ఇంధనాలను తేవాలన్న ప్రతిపాదనను కేంద్రం చేస్తుందా? అని ప్రశ్నించగా మండలి సమావేశానికి ఇంకా సమయం ఉన్నదని, ఆ తేదీ సమీపించిన తర్వాత ఈ ప్రశ్నకు సమాధానమిస్తామని తెలిపారు.

ఎన్నికల వేళ పెట్రో సెగలు

ఎన్నికల రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కీలకాంశంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి స్పందిస్తూ చమురు ధరలు ప్రతిపక్షాల చేతికి అస్త్రంగా మారబోదని వివరించారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రభుత్వమే ఇంధన ధరల పెంపుపై ప్రజలకు సమాధానమివ్వాల్సి ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వమూ స్పందిస్తుందని చెప్పారు. చమురు ధరలను మార్కెట్‌కు అప్పజెప్పామని, ఇప్పుడు చమురు కంపెనీలే ధరలను నిర్ణయిస్తాయని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో చమురుపై పన్నులను తగ్గించడం క్లిష్టమైన అంశమని చెప్పారు.


Next Story

Most Viewed