వాహన ఫైనాన్స్ కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియాతో టాటా మోటార్స్ భాగస్వామ్యం!

by  |
వాహన ఫైనాన్స్ కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియాతో టాటా మోటార్స్ భాగస్వామ్యం!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ప్యాసింజర్ వాహన వినియోగదారులకు ఫైనాన్స్ సదుపాయం అందించేందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు మంగళవారం ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా టాటా మోటార్స్ కస్టమర్లకు బీఓఐ 6.85 శాతం తక్కువ వడ్డీతో రుణాలను అందిస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా ఒప్పందంలో భాగంగా కారు మొత్తం ధరపై గరిష్ఠంగా 90 శాతం ఫైనాన్స్ అందించనున్నట్టు తెలిపింది. ఇది బీమా రిజిస్ట్రేషన్‌తో కలిపి ఉంటుందని పేర్కొంది.

వినియోగదారులు 7 ఏళ్ల చెల్లింపు వ్యవధితో లక్షకు రూ.1,502తో ప్రారంభమయ్యే నెలవారీ వాయిదా(ఈఎమ్ఐ) అవకాశం కూడా ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉందని కంపెనీ వివరించింది. ‘ఈ భాగస్వామ్యం ఇదివరకే ప్రకటించిన ఫైనాన్స్ఈజీ పండుగ ఆఫర్‌కు అనుగుణంగా ఉంటుంది. దీని ద్వారా వినియోగదారులు అవాంతరాలు లేని, సులభ రీతిన మెరుగైన ఫైనాన్స్ పొందడానికి వీలవుతుందని’ టాటా మోటార్స్ సేల్స్, మార్కెటింగ్ అండ్ కస్టమర్ కేర్ విభాగం వైస్-ప్రెసిడెంట్ రాజన్ అన్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా రీటైల్ కస్టమర్లను ప్రత్యేక దృష్టిలో ఉంచుకుని వారి అవసరాలకు అనుగుణంగా ఫైనాన్స్ ప్రయోజనాలను అందిస్తామని బీఓఐ జనరల్ మేనేజర్, రీటైల్ విభాగానికి చెందిన రాజేష్ వెల్లడించారు.


Next Story

Most Viewed