గవర్నర్ తమిళిసై నోట ‘తెలుగు’ మాటల సందేశం.. రాజ్‌భవన్ వీడియో వైరల్

by  |
గవర్నర్ తమిళిసై నోట ‘తెలుగు’ మాటల సందేశం.. రాజ్‌భవన్ వీడియో వైరల్
X

దిశ, ప్రత్యేక ప్రతినిధి: గవర్నర్​ తమిళి సై సౌందరరాజన్​ కాస్త ఇప్పుడు ‘తెలుగు సై’ సౌందరరాజన్‌గా మారుతున్నారు. ఏడాదిన్నరగా తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న గవర్నర్​ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించారు. తెలుగులో స్పష్టంగా మాట్లాడటానికి ఆమె చేస్తున్న ప్రయత్నం చాలా వరకు సఫలమైంది. గవర్నర్​మొదటి సారిగా గురువారం తెలుగులో పూర్తి స్థాయి సందేశం ఇచ్చారు. భారతదేశంలో కొవిడ్ వ్యాక్సిన్​ వేసుకున్న వారి సంఖ్య వంద కోట్లు దాటిన సందర్భంగా ఆమె మీడియాకు వీడియో సందేశం పంపారు. ఐదు నిమిషాలకు పైగా ఉన్న వీడియోలో పూర్తిగా తెలుగు పదాలనే ఉపయోగించారు. ఇంగ్లీష్​జోలికి వెళ్లలేదు. వంద కోట్ల వ్యాక్సిన్​లక్ష్యాన్ని పూర్తి చేసిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశంసించారు. వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ అద్భుత విజయాన్ని సాధించినందుకు ప్రధాని నరేంద్రమోడీతో పాటు ఇందులో కీలక పాత్ర పోషించిన వైద్యులకు, ఆరోగ్య కార్యకర్తలకు, శాస్త్రవేత్తలకు అభినందనలను తెలిపారు. వ్యాక్సినేషన్‌లో రికార్డు సృష్టించడమే కాకుండా విదేశాలకు టీకాలను సరఫరా చేసిన ఘనత భారత్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ దశలో ప్రతి ఒక్కరూ మాస్క్​ధరించి కొవిడ్​ప్రొటోకాల్‌ను పాటించి కరోనా వైరస్​ను పూర్తిగా నిర్మూలించడానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఏడాదిన్నరగా తెలుగు పాఠాలు

రెండేండ్ల కిందట తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలను చేపట్టిన తమిళి సై సౌందరరాజన్​ మొదటి నుంచి తెలుగుభాషపై ఆసక్తిని పెంచుకున్నారు. వాస్తవానికి సెప్టెంబర్, 2019లో బాధ్యతలను చేపట్టిన ఆమె కొంత కాలానికే తెలుగులో అనర్గళంగా మాట్లాడాలని ఆసక్తిని చూపారు. తమిళ బిడ్డను.. తెలుగు సోదరిని అని ప్రకటించుకునే ఆమె తెలుగు బాష అంటే తనకు ఎంతో అభిమానమని చెబుతుంటారు. ఇందులో భాగంగా తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్​ఛాన్స్​లర్​ఆవుల మంజులత‌తో పాటు ఇతరుల వద్ద శిక్షణ పొందారు. వారం రోజులకు రెండు సార్లు తెలుగు పాఠాలను నేర్చుకున్నారు. ఇప్పుడిప్పుడే గవర్నర్​తెలుగు భాషపై పూర్తిగా పట్టుసాధిస్తున్నారని రాజ్ భవన్​వర్గాలు వెల్లడించాయి.


Next Story