కశ్మీర్‌ అంశంలో మాట మార్చిన తాలిబన్లు

by  |
talibans next target kashmir
X

కాబూల్: భారత్, పాకిస్తాన్‌తో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగిస్తామని, కశ్మీర్ అంశం ఇరుదేశాల ద్వైపాక్షిక అంశమని ఇటీవలే చెప్పిన తాలిబన్లు అంతలోనే మాట మార్చారు. తమ వక్ర బుద్ధిని బయటపెట్టారు. కశ్మీర్‌లోని ముస్లింల కోసం మాట్లాడే హక్కు తమకు ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తాలిబన్ల ప్రతినిధి సుహైల్ షాహీన్ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో శుక్రవారం మాట్లాడారు. ‘కశ్మీర్, భారత్‌లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న ముస్లింలందరి తరఫునా గళం వినిపించే హక్కు మాకు ఉంది’ అని తెలిపారు.

‘ముస్లింలు మీ సొంత ప్రజలు. సొంత పౌరులు’ అనే గళాన్ని వినిపిస్తామని తెలిపారు. ‘మీ దేశాల్లోని చట్టాల ప్రకారం ముస్లింలకూ సమాన హక్కులు ఉంటాయి’ అని చెప్పారు. కాగా, కశ్మీర్ అంశంలో తాము జోక్యం చేసుకోబోమని, భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నామని తాలిబన్ అగ్రనేత అనాస్ హక్కానీ ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే. మరోవైపు తాలిబన్లతో భారత ప్రభుత్వం భేటీ అయిన కొద్దిరోజులకే వారి నుంచి ఈ తరహా ప్రకటన రావడం గమనార్హం. ఇప్పటికే అఫ్ఘాన్‌లో తాలిబన్ల పాలనతో భారత్‌కు ఉగ్రముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో తాజా ప్రకటన ఆందోళన రేకెత్తిస్తున్నది.


Next Story