అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నాకే పాఠశాలలు రీఓపెన్ : తలసాని

by  |
అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నాకే పాఠశాలలు రీఓపెన్ : తలసాని
X

దిశ ప్ర‌తినిధి , హైద‌రాబాద్ : అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే రాష్ట్రంలో విద్యా సంస్థలను తెరిచే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. పిబ్రవరి 1 వ తేదీ నుండి 9, 10 తరగతుల, ఇంటర్, డిగ్రీ తరగతుల నిర్వహణ కోసం విద్యా సంస్థలను తెరవాలని ప్రభుత్వం అనుమతించిన నేపధ్యంలో బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్ఆర్డీ ) లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , హోం శాఖ మంత్రి మహమూద్ అలీ తో కలిసి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల నిర్వహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. విద్యాసంస్థలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. పాఠశాలల నిర్వాహకులు కూడా ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాలని ఆదేశించారు. విద్యార్ధుల తల్లిదండ్రుల తో సమావేశాలు నిర్వహించి వారికి అవగాహన కల్పించాలని చెప్పారు. విద్యార్ధులు ఖచ్చితంగా మాస్క్ లు ధరించేలా చూడాలని, శాని టైజర్ లు అందుబాటులో ఉంచాలని అన్నారు. అదేవిధంగా తరగతి గదిలో విద్యార్ధులు కనీస దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. టాయిలెట్స్ ఎప్ప్దుడు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్ధుల తల్లిదండ్రుల నుండి తప్పనిసరిగా ఎన్ఓసీ డిక్లరేషన్ తీసుకోవాలని చెప్పారు.

ప్రతి పాఠశాలలో తప్పని సరిగా ఒక గదిని ఐసో లేషన్ కోసం కేటాయించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో కూడా జీహెచ్ఎంసీ ఆద్వర్యంలో శానిటైజేషన్ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ విషయంలో న‌గ‌ర పాల‌క సంస్థ , విద్యా శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. విద్యార్ధుల తల్లిదండ్రులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాద్యత మనపై ఉందని చెప్పారు. విద్యార్ధుల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత విద్యాసంస్థల నిర్వాహకులైన మీ పై ఉందన్నారు. ఈ సందర్భంగా పలు విద్యా సంస్థల కు చెందిన ప్రతినిధులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు రాగా సానుకూలంగా స్పందించారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్లు ఉన్నాయని, సకాలంలో నిధులు కాని కారణంగా బిల్లులు చెల్లించకపోవడం వలన విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని మంత్రికి వివరించారు. సమావేశం అనంతరం ట్రాన్స్ కో సీఎండీ రఘుమారెడ్డి తో మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఫోన్ లో మాట్లాడి ప్రభుత్వ విద్యా సంస్థల లో విద్యుత్ సరఫరా ను వెంటనే పునరుద్దరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పాఠశాలను తెరిచిన అనంతరం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిర్వహణ ను పర్యవేక్షించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కలెక్టర్ శ్వేతా మహంతి, జీహెచ్ఎంసీ అద‌న‌పు కమిషనర్ సంతోష్, జిల్లా విద్యాశాఖాధికారి రోహిణి, ఇంటర్ బోర్డ్ అధికారి జయప్రదలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed