నీళ్లతో ఈజీగా పండించేయండిలా….

by  |
నీళ్లతో ఈజీగా పండించేయండిలా….
X

దిశ, కుత్బుల్లాపూర్ : సాగు అంటేనే సాయిల్(భూమి).. భూమి లేకుండా కల్టివేషన్ కష్టం.. దేనికైనా భూమే ఆధారం.. ఇదంతా ఒకప్పుడు.. ఇప్పుడు సాయిల్ లేకుండా వాటర్లోనే సాగు చేసే టెక్నాలజీ వచ్చింది. హైడ్రోపోనిక్స్ద్వారా నీటిలోనే ఆకుకూరలు పండించే సిస్టం ఇంట్రడ్యూస్ అయ్యింది.. ప్లానింగ్ ఉండాలే కాని రాయి మీద కూడా విత్తనాలు మొలిపించొచ్చు అనే మాటను ఇప్పుడు నిజం చేసే సాంకేతికతను మానవ మేధా నిజం చేస్తున్నది.. జీడిమెట్లలో సాగువుతున్న ఈ వెజిటెబుల్స్ కల్చివేషనే ఇందుకు మంచి ఉదహరణ.

మనందరికి తెలిసిన వ్యవసాయం చేయాలంటే భూములుంటేనే సాధ్యం. కొద్ది స్థలంలోనైనా పంటలను వేసుకుని సాగు చేయొచ్చు. కానీ నీటిలో కూరగాయలు, ఆకు కూరలు పండించడం అంటే ఓ ప్రయోగమే.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పారిశ్రామిక వాడ పైప్ లైన్ రోడ్డులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఆ అద్భుత దృశ్యాన్ని చూడొచ్చు. కేవలం నీటి సహాయంతోనే ఆకుకూరల సాగు ను హైడ్రోపోనిక్స్ సిస్టం ద్వారా చేయొచ్చని రుజువు చేశారు ఇక్కడి మేధావులు. 20 రోజులుగా చేస్తున్న ప్రయోగంలో విజయవంతమై ఉన్నతాధికారుల ప్రశంసలూ అందుకున్నారు.

• వ్యాపారపరంగా కాకుండా కేవలం పట్టణాల్లోనే ఈ పంటలు వేసుకోవచ్చు. రైతులు చేస్తే గిట్టుబాటు ఉండదు. నగరాల్లో పదంతస్తుల భవనంపై కూడా ఈ సాగు సాధ్యమే. అధికారులు పట్టణవాసులకు దీనిని అందుబాటులోకి తెచ్చారు.
• రైతులను ఆధునికత వైపు మళ్లించే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర సహకారంతో జీడిమెట్లలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను నడుపుతోంది. ఇందులో పంటల సాగుకు కొత్త కొత్త ప్రయోగాలు చేయడం, తక్కువ ధరలకు రైతులకు మొక్కలు అందించడం, పంటలపై అవగాహన కల్పించేందుకు శిక్షణ కూడా ఇస్తున్నారు. దీనికి కోసం పాలీహౌజ్లను ఏర్పాటు చేసింది. ఇందులో హైడ్రో పోనిక్స్ సిస్టం ద్వారా నీటిలోనే పంటలు పండించారు. కొంత బంక మట్టిని 300 డిగ్రీల ఉష్ణోగ్రతలో కాల్చి ముద్దలుగా చేసి, నీటిలో వేసే మొక్కల మొదటి భాగంలో చిన్న చిన్న ముద్దలు పెడతారు. కేవలం మొక్కకు ఆక్సిజన్ అందడానికి మాత్రమే ఈ మట్టిని పెడతారు.
• హైడ్రో పోనిక్స్ (జలసాగు)తో ఆకు కూరలు పండించవచ్చు. పంట సాగు పూర్తిగా నీటిలోనే అయినా భూమిలో పండించే సమయంలో వాడే నీటితో పోల్చితే 90 శాతం తక్కువగానే నీటి వినియోగం ఉంటుంది. పైగా, మట్టితో చేసే సాగుకంటే మూడు రెట్లు దిగుబడి అధికం. సంవత్సరం మొత్తంగా సాగు చేసుకోవచ్చు. కానీ కేవలం మొత్తడి మొక్కలు మాత్రమే అనుకూలం.

ఈ సాగులో మూడు రకాలు….

న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్(ఎన్ఎఫ్టీ) లో రిజర్వాయర్ బాక్సుల నుంచి మొక్కలకు కావాల్సిన పోషకాలను, నీటిని చదరపు పైపులతో మోటార్ ద్వారా పంపిస్తారు. పైపుల్లో నీరు తిరిగి రిజర్వాయర్ లోకి చేరుతుంది. కొద్ది ఎత్తు నుంచి నీరు రిజర్వాయర్ లో పడడంతో గాలిలో ఉండే ఆక్సిజన్ నీటిలో కలిసి మొక్కలకు చేరుతుంది. ఈ పద్ధతితో మొక్కకు తగినంత నీరు, పోషకాలు, ఆక్సిజన్ అందుతాయి. ఈ టెక్నిక్ ద్వారా తక్కువ సమయంలో దిగుబడిని తీయొచ్చు.

డీప్ వాటర్ కల్చర్(డీడబ్ల్యూసీ)…

డీప్ వాటర్ కల్చర్ (డీడబ్ల్యూసీ) లో నీటిని చతురస్రాకారపు బాక్సులు, డబ్బాల్లో నింపుతారు. స్టైరోఫోమ్స్ ద్వారా నెట్ పాట్ మొక్కలకు వదులుతారు. ఇందులో ఆక్సిజన్ కోసం చిన్నపాటి ఆక్వేరియం బబ్లర్ ను ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో తక్కువ ఖర్చుతో ఎక్కువ మొక్కలను పెంచవచ్చు.

డచ్ బకెట్ సిస్టం

మొదటగా డచ్ దేశంలో వాడడంతో దీనిని డచ్ బకెట్ సిస్టంగా పిలుస్తారు. బకెట్ లో కావాల్సిన పోషషకాలను నింపి బకెట్ మూతకు 2 లేదా మూడు ఇంచుల రంధ్రం పెడతారు. లెకాం బాల్స్ సహాయంతో మొక్క నారును నీటిలో వదులుతారు. ఈ సిస్టంలో టమోటా, బీర, కీర, కాకరతో పాటు అన్ని రకాల గ్రోబ్యాగ్ సిస్టం కూరగాయలను పండించుకోవచ్చు. ఇది సులభమైన పద్ధతి. వివిధ సైజుల్లో లభించే బ్యాగుల్లో కొబ్బరి పీచు ఫౌడర్ 75 శాత, పర్లైట్ 20 శాతం, వర్మికులైట్ 5 శాతం సమపాళ్లలో కలిపి బకెట్ నింపుతారు. డ్రిప్ పైప్ లైన్ ద్వారా హైడ్రో పోనిక్ ద్రావణం ప్రతి మొక్కకు అందేలా ఏర్పాటు చేస్తారు. తక్కువ బరువుండే ఈ ద్రావణంలో ఎక్కువ రంధ్రాలుండడంతో ఆక్సిజన్ వేర్లకు పట్టుకుంటుంది. దీనిలో అన్ని రకాల ఆకుకూరలు, తీగజాతి పంటలను వేసుకోవచ్చు. మట్టి భూమిలో ఎకరానికి 40 నుంచి 50 టన్నుల పంట దిగుబడి వస్తే ఈపద్ధతి ద్వారా రెండింతలు వస్తుంది.

పట్టణ వాసులకైతే మంచిది..

హైడ్రోపోనిక్స్తో నీటి ద్వారా వేసే పంటల వల్ల క్రిమి, కీటకాలు రావు. రసాయనాలు లేకుండా చేసే ఈ సాగుతో ఆరోగ్యకర జీవన విధానాన్ని పొందవచ్చు. ఈ పంట సాగు గురించి తెలుసుకోవాలంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో చేస్తున్న ప్రయోగాన్ని వీక్షించవచ్చు. శిక్షణనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము. ఏమైనా సలహాలు కావాలంటే 7997724922 నెంబర్ లో సంప్రదించవచ్చు. -రామకృష్ణ, ఉద్యాన అధికారి.


Next Story

Most Viewed