మండలి ప్రచారానికి స్వామిగౌడ్​ ఎందుకు దూరమైనట్టు..?

by  |
మండలి ప్రచారానికి స్వామిగౌడ్​ ఎందుకు దూరమైనట్టు..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : మండలి ఎన్నికల్లో స్వామిగౌడ్​ కనిపించడం లేదు.. బీజేపీ తరుపున ప్రచారానికి తిరుగడం లేదు.. అసలేమైంది.. స్వామిగౌడ్​ ఎక్కడ..? అనేది ఇప్పుడు ఉద్యోగుల్లో హాట్​ టాపిక్​గా మారింది. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఎన్జీఓ తరుపున ఉద్యోగులను ఏకం చేసి ముందుండి నడిపించిన టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు, మండలి మాజీ ఛైర్మన్​ స్వామిగౌడ్​ మండలి ఎన్నికల్లో కనిపించడం లేదు. పలు కారణాలతో గులాబీ గూటి నుంచి వెళ్లిపోయి కాషాయం కండువా కప్పుకున్న స్వామిగౌడ్​… జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ప్రచార బాధ్యతలను ఎత్తుకున్నారు. ఉద్యోగులు, రిటైర్డ్​ ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కలియ తిరిగారు. ఎందుకంటే ఉద్యోగ వర్గాల్లో స్వామిగౌడ్​కు ఇంకా ఎంతో కొంత మద్దతు ఉంటూనే ఉంది. కానీ ప్రస్తుతం ఉద్యోగుల ఓట్లు కీలకంగా మారిన మండలి పోరులో మాత్రం దూరంగా ఉంటున్నారు. బీజేపీ సిట్టింగ్​ స్థానం హైదరాబాద్​–రంగారెడ్డి–మహబూబ్​నగర్​ స్థానంలో ప్రచారం చేస్తారని అందరూ భావించారు. కానీ స్వామిగౌడ్​ ఎక్కడా కనిపించడం లేదు. ఇదే స్థానం నుంచి టీఆర్ఎస్​ తరుపున పోటీ చేసి ఓడిపోయిన దేవీ ప్రసాద్​ బ్రహ్మాణ సామాజికవర్గం ఓట్లతో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా సమీకరణలు చేస్తున్నారు. కానీ స్వామిగౌడ్​ మాత్రం బయటకు రావడం లేదు.

అసలేం జరిగిందో..?

మండలి ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్​అస్త్రాలన్నీ బయటకు తీసింది. ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకునే విధంగా వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. వ్యతిరేకవర్గాలుగా ఉన్న వారందరినీ దగ్గరకు తీస్తోంది. ప్రధానంగా ఉద్యోగ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు చాలా ప్రయత్నాలే చేస్తోంది. వ్యతిరేకంగా ఉన్న ఉద్యోగ సంఘాల నేతలను పిలుపించుకుని మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్​ పెద్దలు, మంత్రులు ఫోన్లు చేసి వారిని ప్రచారానికి దింపుతున్నారు. మరోవైపు ఉద్యోగ జేఏసీ కూడా నిన్నటి వరకు పట్టించుకోకుండా ఉన్నట్టే ఉన్నా… ఇప్పుడు మాత్రం మండలి ఓటు అవగాహన సదస్సుల పేరిట ఉద్యోగులను ఏకం చేసేందుకు రంగంలోకి దిగింది. అటు ఇంటర్ జేఏసీ ఛైర్మన్​ మధుసూదన్​రెడ్డిని కూడా టీఆర్ఎస్​కు అనుకూలంగా ఉండేలా మార్చేసుకున్నారు. అంతేకాకుండా చాలా మంది ఉద్యోగ సంఘాల నేతలను వ్యతిరేకంగా మాట్లాడకుండా అడ్డుకట్ట వేయడంలో టీఆర్ఎస్​ అధిష్టానం సక్సెస్​ సాధించినట్లైంది. అంటే మండలి ఎన్నికలను టీఆర్ఎస్​ పార్టీ​ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో తెలుస్తోంది.

స్వామిగౌడ్​ ఎక్కడ..?

వాస్తవంగా ఉద్యోగుల్లో స్వామిగౌడ్​ది ప్రత్యేకమైన ముద్ర. తెలంగాణ ఉద్యమానికి ఉద్యోగులు ముందుకు రాని సందర్భంగా టీఎన్జీఓకు అధ్యక్ష పగ్గాలు చేపట్టిన స్వామిగౌడ్… కార్యదర్శి దేవీ ప్రసాద్​తో కలుపుకుని ఉద్యమంలో భాగస్వాముల్ని చేశారు. దీంతో సీఎం కేసీఆర్​దగ్గర స్వామిగౌడ్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో… స్వరాష్ట్ర తొలి మండలికి ఛైర్మన్​ అయ్యారు. పదవీ కాలం పూర్తి అయిన తర్వాత… కారణాలేమైనా స్వామిగౌడ్​ను పక్కన పెట్టారు. దీంతో హర్ట్​ అయిన స్వామిగౌడ్​… మాతృ సంస్థ కాషాయం కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో సీఎం కేసీఆర్​ లక్ష్యంగా ఆరోపణలు చేశారు. స్వామిగౌడ్​ చేరికతో ఎంతో కొంత కలిసి వస్తుందని బీజేపీ కూడా భావించింది.

అయితే ప్రస్తుతం జరుగుతున్న మండలి ఎన్నికల్లో స్వామిగౌడ్​ ప్రచారం చేస్తారని ఉద్యోగవర్గాలు భావించాయి. ఎందుకంటే ఉద్యోగుల ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకం. కానీ ఆయన మాత్రం చాలా దూరంగా ఉన్నారు. అసలు ప్రచారానికి రావడం లేదు. కనీసం ఒక్క ప్రకటన కూడా చేయడం లేదు. అసలు స్వామిగౌడ్​ స్థానికంగా ఉన్నారా… లేదా అనే అనుమానలు వ్యక్తమవుతున్నాయంటే… అసలేం జరిగిందనేది ఉద్యోగుల్లో హాట్​ టాపిక్​.

టికెట్​ ఆశించి భంగపడ్డారా..?

బీజేపీలో చేరే సమయంలో ఆ పార్టీ అధిష్టానం స్వామిగౌడ్​కు పలు హామీలిచ్చినట్లు ప్రచారంలో ఉంది. బీజేపీ సిట్టింగ్​ స్థానమైన హైదరాబాద్​ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు టాక్. కానీ సిట్టింగ్​ ఎమ్మెల్సీని కాదని టికెట్​ఇవ్వడం కష్టమే. దీనికి స్వామిగౌడ్​ కొంత అలకబూనినట్లు ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. అందుకే ప్రచారానికి రావడం లేదంటూ చర్చించుకుంటున్నారు.

ఇంకేమైనా కారణాలున్నాయా..?

మరోవైపు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలను ఇటీవల టార్గెట్​ చేసిందని ఉద్యోగ వర్గాల్లో చర్చ. అందులోనూ స్వామిగౌడ్​ పార్టీ మారారు. స్వామిగౌడ్​ హయాంలో ఉద్యోగులకు సంబంధించిన గచ్చిబౌలి ఇండ్ల స్థలాల్లో కొన్ని తప్పిదాలు దొర్లాయనే అపవాదు ఉంది. ఒకవేళ అధికార పార్టీ దాన్ని సాకుగా చూపించి ఏదైనా భయాందోళనకు గురి చేసిందా… అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదే నిజమైతే… ఇంకా ఎక్కువగా ప్రచారంలో చేయాల్సి ఉంటుందంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం భయపెడితే భయపడే ప్రసక్తే ఉండరాదని స్వామిగౌడ్​ మద్దతుదారుల వాదన. ఏం జరిగిందో కానీ… స్వామిగౌడ్​ మాత్రం కీలకపోరులో కనిపించడం లేదు.



Next Story