సుశాంత్ అభిమానులకు తప్పని నిరాశ..

by  |
సుశాంత్ అభిమానులకు తప్పని నిరాశ..
X

బాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య.. అన్ని సినీ పరిశ్రమల్లోని చీకటి కోణాల్ని ప్రపంచం ముందుంచుతోంది. ఇక సుశాంత్ మరణం తన అభిమానుల్ని సైతం షాక్‌కు గురిచేసింది. ప్రేక్షకులకు తన సినిమాలనే జ్ఞాపకాలుగా మిగిల్చి వెళ్లిన సుశాంత్.. చివరగా ‘చిచ్చోరే’ సినిమాలో కనిపించాడు. అయితే సుశాంత్ నటించిన మరో సినిమా ‘దిల్ బచారే’ జులై 24న ఓటీటీ (డిస్నీ + హాట్‌‌స్టార్‌)లో విడుదలకానుంది.

లాక్‌డౌన్‌కు ముందే షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాలకు ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఒక్కటే మార్గంగా కనబడుతోంది. ఓటీటీలు కూడా భారీగానే ఆఫర్ చేస్తుండటంతో నిర్మాతలు అటు వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలోనే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరగా నటించిన ‘దిల్ బచారే’ సినిమాను కూడా ఓటీటీలోనే విడుదల చేయబోతున్నారు. అయితే సుశాంత్ అభిమానులు మాత్రం ఆయన నటించిన చివరి సినిమాను థియేటర్‌లో విడుదల చేయాలని సోషల్ మీడియా వేదికగా ఫిల్మ్ మేకర్స్‌కు రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. కానీ ఫిల్మ్ యూనిట్ వాటిని పట్టించుకోవడం లేదు. ఫిల్మ్ యూనిట్ నుంచి ఓటీటీ విడుదల తేదీ, కొత్త పోస్టర్ రావడంతో.. సుశాంత్ అభిమానులకు నిరాశ తప్పలేదు. హాలీవుడ్ ‘ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ అనే చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన ‘దిల్ బచారే’ మూవీకి కాస్టింగ్ డైరెక్టర్‌ అయిన ముఖేష్ చాబ్రా దర్శకత్వం వహించారు. సంజనా సాంగీ, సుశాంత్‌కు జోడీగా నటించింది. సంజనాకు ఇదే డెబ్యూ మూవీ కాగా.. ఇందులో సైఫ్ అలీఖాన్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటించాడు.

‘ఇది ఓ ప్రేమకథ. ఎప్పటికీ వీడిపోని జ్ఞాపకాల కథ. మన మనసుల్లో, చిరునవ్వుల్లో సుశాంత్ సింగ్ ఎప్పటికీ బతికే ఉంటాడు’ అని ఈ సందర్భంగా సంజన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

Next Story