పెగాసస్ పిల్‌పై ‘సుప్రీం’ విచారణ.. ఏం చెప్పనుంది..?

by  |
పెగాసస్ పిల్‌పై ‘సుప్రీం’ విచారణ.. ఏం చెప్పనుంది..?
X

న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్‌తో పౌరులపై నిఘా వేస్తున్నదన్న ఆరోపణలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌తో విచారణ జరిపించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు వచ్చే వారం విచారించనుంది. సిట్టింగ్ జడ్జీ లేదా మాజీ న్యాయమూర్తి సారథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందంతో పెగాసస్ స్పైవేర్‌పై వస్తున్న ఆరోపణలను దర్యాప్తు చేయాలని కోరుతూ సీనియర్ జర్నలిస్టులు ఎన్ రామ్, శశి కుమార్‌లు సుప్రీంకోర్టులో పిల్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిల్‌ను విచారించడానికి లిస్ట్ చేయాల్సిందిగా పిటిషనర్ల తరఫు న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను కోరారు.

అనంతరం, ఈ పిల్‌ను సుప్రీంకోర్టు వచ్చే వారం విచారిస్తుందని న్యాయస్థానం వెల్లడించింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్‌‌వో అభివృద్ధి చేసిన పెగాసస్‌తో భారత ప్రభుత్వం పాత్రికేయులు, కార్యకర్తలు, ప్రతిపక్ష నేతలు, న్యాయమూర్తులు, ఇద్దరు కేంద్రమంత్రులపైనా నిఘా వేశారని ‘ది వైర్’ న్యూస్ పోర్టల్ రెండు వారాల క్రితం ఓ సంచలన కథనం ప్రచురించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి దీనిపై చర్చకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి.


Next Story