సపోర్ట్ తీరు మారింది!

by  |
సపోర్ట్ తీరు మారింది!
X

దిశ, వెబ్‌డెస్క్ :

ఒకప్పుడు ఎవరైనా చేసిన పనిని తప్పుబడితే, వారికి సపోర్ట్ చేయడానికి దారులు వెతికే లోపు ఆ పని గురించి, చేసిన వ్యక్తి గురించి అందరూ మర్చిపోయేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. తప్పు లేకున్నా వేరే ఎవరినైనా దూషించినా, అసభ్యంగా మాట్లాడినా సోషల్ మీడియా సాయంతో వెంటనే బాధితులకు మద్దతునిస్తూ, తప్పుగా మాట్లాడిన వాళ్లను ఫుట్‌బాల్ ఆడుకోవచ్చు. ఆ క్రమంలోనే ఏదైనా అంశాన్ని ఎవరైనా తప్పుబడితే ఆ అంశం గురించి సపోర్ట్ చేస్తూ, లేదంటే విమర్శిస్తూ కామెంట్ చేసుకునే, పోస్ట్ పెట్టుకునే స్వేచ్ఛ సోషల్ మీడియా కల్పించింది. అందుకే బాధితులు చిన్నవాళ్లా, పెద్ద వాళ్లా, పరపతి ఉన్నవాళ్లా లేనివాళ్లా అని చూడకుండా సంఘటన తీవ్రతను బట్టి సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు తమ సోషల్ మీడియా ఖాతాల్లో సపోర్ట్ చేస్తూ, అన్యాయానికి వ్యతిరేకంగా తమ గొంతుకను కలుపుతారు.

ఇందుకోసం వారు హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేయడం, చర్చలు నిర్వహించడం, బాధితులకు సాయం చేయడానికి చారిటీ కార్యక్రమాలు నిర్వహించడం.. ఇలా రకరకాలుగా తమకు తోచినట్లుగా సపోర్ట్‌ను తెలియజేస్తారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ముఖ్యంగా మహిళా సంబంధిత అంశాల్లో ఈ ట్రెండ్ కనిపిస్తోంది. సాధారణంగా సోషల్ మీడియాలో ఆడవాళ్లు పెట్టే పోస్టులకు అసభ్య కామెంట్లు వస్తుంటాయి. వారి దుస్తుల గురించి, కూర్చునే విధానం గురించి నానా రకాలుగా కామెంట్లు చేస్తుంటారు. అయితే గతంలో ఇలా కామెంట్ చేసిన వాళ్లను తప్పుబడుతూ చర్చాగోష్టి, హ్యాష్ ట్యాగ్ ట్రెండ్‌లు జరుగుతుండేవి. కానీ ఇప్పుడు అలా కాదు. సపోర్ట్ చేసే తీరు మారిపోయింది. ఎవరైనా ఒక మహిళ లేదా అమ్మాయి పోస్ట్ చేసిన ఫొటోకు ఎవరైనా తప్పుడు కామెంట్లు చేస్తే సరిగ్గా అలాంటి ఫొటోనే దిగి సెలెబ్రిటీలు, సామాన్య మహిళలు పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేసిన అమ్మాయికి తప్పుడు భావన కలగకుండా ధైర్యాన్ని ఇవ్వడానికి ఇలా చేస్తున్నారు.

ఫిన్‌లాండ్ ప్రధాని సన్నా మారిన్‌నే ఉదాహరణగా తీసుకుంటే, ఆమె దాదాపు నడుము వరకు తెరిచి ఉన్న బ్లేజర్ ధరించి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోకు చాలా మంది తప్పుడు కామెంట్లు చేసి, అసభ్య రాతలు రాశారు. దీన్ని చూసిన సాటి మహిళలు, సన్నాకు సపోర్ట్ చేస్తూ తాము నడుపు వరకు తెరిచి ఉన్న బ్లేజర్ ధరించి ఉన్న ఫొటోలను పెట్టారు. మన దేశంలో కూడా కేరళకు చెందిన ఓ మహిళ, మోకాళ్లు కనిపించేలా ఫొటో పెట్టి అసభ్య కామెంట్లను అందుకుంది. ఆమెకు మద్దతుగా కొందరు కేరళ నటీమణులు తాము కూడా మోకాళ్ల వరకు ధరించి ఉన్న ఫొటోలను పోస్ట్ చేశారు. తప్పుడు కామెంట్లు చేసే వాళ్లను అరికట్టలేం కాబట్టి ఆ కామెంట్ల వల్ల ఫొటోలు పెట్టిన వారు మానసికంగా ఆందోళన చెందకూడదనే ఉద్దేశంతో ఈ ట్రెండ్ పుట్టుకొచ్చింది. ఏదేమైనా బాధితురాలికి ఏదో రకంగా మేలు చేయగలిగితే అంతే చాలు!


Next Story

Most Viewed