మున్సిపల్ ఎన్నికల ఖర్చును 45 రోజుల్లోగా సమర్పించండి : ఈసీ

by  |
మున్సిపల్ ఎన్నికల ఖర్చును 45 రోజుల్లోగా సమర్పించండి : ఈసీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ఇటీవల నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీలో పాల్గొన్న అభ్యర్థులతో పాటు ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కూడా తమ ఎన్నికల ఖర్చును సకాలంలో సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తేదీ (మే 3) నుంచి 45 రోజుల్లోగా వివరాలు అందించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం. అశోక్ కుమార్ వెల్లడించారు.

రాష్ట్రంలో రెండు కార్పొరేషన్లకు, రెండు మున్సిపాలిటీలకు ఏప్రిల్ 30న ఎస్ఈసీ ఎన్నికలు నిర్వహించింది. అలాగే అనివార్య కారణాల వల్ల ఖాళీలు ఏర్పడిన తొమ్మిది వార్డులకు గాను ఎన్నికలు నిర్వహించగా నాలుగు ఏకగ్రీవమయ్యాయి. ఐదు వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన నేతలు తమ ఖర్చును జూన్ 8వ తేదీ లోపు అందించాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఎన్నికల్లో పాల్గొన్న అభ్యర్థులకయితే జూన్ 16వ తేదీ వరకు సమర్పించాలని గడువు పెట్టారు. ఈ వివరాలను కలెక్టర్ లేదా జిల్లా ఎన్నికల అథారిటీకి అందజేయాలని ఎస్ఈసీ సూచించింది.

నిర్లక్ష్యం వహిస్తే అంతే సంగతులు..

అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయాన్ని సమర్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అభ్యర్థులను రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. అభ్యర్థి గెలిచినా, ఓడిపోయినా, ఏకగ్రీవమైనా ఖర్చు వివరాలు అందించకుంటే మూడేళ్లపాటు జరిగే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా అనర్హత వేటు పడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. గెలుపొందిన అభ్యర్థి అయితే మూడేళ్ల పాటు పోటీ చేయడానికి అనర్హతతో పాటు పదవి కూడా కోల్పోయే ప్రమాదముందని స్పష్టం చేసింది. గత ఎన్నికల్లోనూ అభ్యర్థులు తమకు ఈ నిబంధనలు ఉన్నట్లు తెలియదని, ఏ అధికారి తమకు చెప్పలేదని వాపోయారని అందుకే ఈ విషయంపై అభ్యర్థులు దృష్టిసారించి సకాలంలో ఎన్నికల ఖర్చును సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Next Story