విద్యుత్ షాక్ తో జేఎల్ఎం మృతి

by Sridhar Babu |
విద్యుత్ షాక్ తో జేఎల్ఎం మృతి
X

దిశ, సంగారెడ్డి : వైర్లు సరిచేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై జూనియర్ లైన్ మెన్ బాల్ రాజు(24) మృతి చెందారు. శుక్రవారం మునిపల్లి మండల పరిధిలోని మల్లిఖార్జున పల్లి గ్రామంలో విద్యుత్ జూనియర్ లైన్ మెన్ గా పనిచేస్తున్న బాల్ రాజు గ్రామంలో విద్యుత్ తీగలు సరిచేసేందుకు విద్యుత్ స్తంభంపైకి ఎక్కారు. విద్యుత్ తీగలు సరిచేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో స్తంభంపైనే పడిపోయాడు. స్తంభంపై ఉన్న విద్యుత్ తీగలకు చిక్కుకొని బాల్ రాజు మృత్యువాత పడ్డారు.

గత అక్టోబర్ లో జూనియర్ లైన్ మెన్ గా నియామకం..

సంగారెడ్డి పట్టణం కింద బజారుకు చెందిన బాల్ రాజు 2023 అక్టోబర్ నెల 7వ తేదీన మునిపల్లి మండలం మల్లిఖార్జునపల్లి జూనియర్ లైన్ మెన్ గా నియామకమయ్యారు. అప్పటి నుంచి గ్రామంలో విద్యుత్ జేఎల్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా శుక్రవారం గ్రామంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం రావడంతో దానిని సరిచేసేందుకు విద్యుత్ స్తంభంపైకి ఎక్కారు.

కానీ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై మరణించారు. బాల్ రాజు తండ్రి సంగారెడ్డి మున్సిపాలిటీలో శానిటేషన్ వర్కర్ గా పనిచేస్తున్నారు. అతనికి తండ్రితో పాటు తల్లి, ఒక చెల్లెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న విద్యుత్ ఏడీఏ వీరారెడ్డి, ఏఈ ప్రశాంత, మునిపల్లి ఎస్ఐ సురేష్ లు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Next Story