ఆధునిక భారతదేశ చరిత్ర: ఇండియన్ హిస్టరీ (గ్రూప్ -2,3,4/ఎస్ఐ, కానిస్టేబుల్)

by Disha Web Desk 17 |
ఆధునిక భారతదేశ చరిత్ర: ఇండియన్ హిస్టరీ (గ్రూప్ -2,3,4/ఎస్ఐ, కానిస్టేబుల్)
X

ఆధునిక భారతదేశంలో సామ్రాజ్యవాద వ్యాప్తికి దక్షిణాదిలోనే పునాదులు పడ్డాయి.

కర్నాటిక్ రాజ్యానికి పాలకుడైన అన్వరుద్దీన్.. ఆంగ్లో కర్నాటక, ఫ్రెంచ్ యుద్ధాలలో ఆంగ్లేయులకు మద్దతు పలికాడు.

తొలి దశలో కర్నాటిక్ కేంద్రంగా ఆంగ్లేయులు బలపడ్డారు.

ముఖ్యంగా రాబర్ట్‌క్లైవ్ ఆర్కాట్‌ను ముట్టడించి తన ఆక్రమణలోకి తెచ్చుకోవడంతో కర్నాటిక్ నవాబు పూర్తిగా ఆంగ్లేయులపై ఆధారపడవలసిన పరిస్థితి తలెత్తింది.

దేశంలోనే అతిపెద్ద స్వదేశీ సంస్థానం హైదరాబాద్ నిజాం ప్రభువులు ఆంగ్లేయులకు సహకరించారు.

1766లో నవాబు నిజాం అలీ ఉత్తర సర్కారులు (కోస్తా జిల్లాలను) ఆంగ్లేయులకు బదిలీ చేశాడు.

1798లో లార్డ్ వెల్లస్లీ రూపొందించిన సైన్య సహకార విధానానికి అంగీకరించిన మొట్ట మొదటి పాలకుడైనాడు.

ఆంగ్లేయులకు ప్రధాన శత్రువులైన మైసూర్‌తో జరిగిన యుద్ధాల్లో నవాబు ఆంగ్లేయులకు సహకరించాడు.

వారి సైనిక భారాన్ని బరిస్తూ చివరకు తనకు సంక్రమించిన దత్తమండలాలను ఆంగ్లేయులకే సమర్పించాడు.

1857 సిపాయిల తిరుగుబాటును కూడా అణిచివేయుటకు సహకరించారు.

బెంగాల్ ప్రాంతానికి పాలకులైన నవాబులు ఆంగ్లేయులకు సహకారం అందించారు.

నవాబు సిరాజ్ ఉద్దౌలా, మీర్ ఖాసీంలను తప్పించి కుట్రతో మీర్జాఫర్ పాలకుడయ్యాడు.

మీర్జాఫర్ ఆంగ్లేయులకు ఎగుమతి, దిగుమతి సుంకాలు లేని స్వేచ్ఛా వ్యాపార హక్కులు కల్పించారు.

దీంతో ఆర్థికంగా ఇంగ్లీష్ ఈస్టిండియా కంపెనీ బలపడింది.

భారతదేశానికి నామమాత్రపు పాలకుడైన మొఘల్ చక్రవర్తి కూడా పరోక్షంగా ఆంగ్లేయులకు తోడ్పడినాడు.

1765 అలహాబాద్ సంధి ద్వారా బెంగాల్, బీహార్ ఒరిస్సాలలో భూమి శిస్తు వసూలు చేసుకుని దివాని హక్కును ఆంగ్లేయులకు ప్రసాధించాడు. దీంతో ఆంగ్లేయులు తమ విస్తృతమైన బెంగాల్ వనరులను సామ్రాజ్యవాద వ్యాప్తికి ఉపయోగించారు.

అత్యంత బలమైన మరాఠ సంకీర్ణ కూటమి కూడా ఆంగ్లేయులకు సహకరించారు.

ఆంగ్లేయులకు ప్రధాన శత్రువైన హైదరాలీ, టిప్పుసుల్తాన్‌లను ఒడించడంలో మరాఠాలు ఆంగ్లేయులకు సహకరించారు.

మరాఠ కూటమికి అధ్యక్షుడైన పీష్వా స్వయంగా సైన్య సహకార పద్దతికి అంగీకరించి మరాఠ కూటమి దెబ్బతినడానికి కారకుడయ్యాడు.

పంజాబ్‌లో ఆంగ్లేయులను ఎదిరించే సత్తా ఉన్నప్పటికీ రాజా రంజిత్‌సింగ్ కూడా ఆంగ్లేయుల పట్ల స్నేహాన్ని కనబరిచాడు.

సిక్కులు ఆఫ్ఘాన్ యుద్ధంలో ఆంగ్లేయులకు సహకరించారు.

పై విధంగా స్వదేశీ శక్తుల సహకారంతో ఆంగ్లేయులు తమ సామ్రాజ్యాన్ని నిర్మించారు.

స్వదేశీ వైఫల్యానికి కారణాలు..

కర్నాటిక్ నవాబు అన్వరుద్దీన్ ఫ్రెంచివారి భయం వలన ఆంగ్లేయులను చేరదీయ వలసి వచ్చింది.

హైదరాబాద్‌లో నవాబు ఆర్థిక సమస్యల వలన ఉత్తర సర్కార్‌లను ఆంగ్లేయులకు బదిలీ చేశాడు.

మరాఠాలు, హైదరలీ నుండి ప్రమాదాన్ని శంకించి ఆంగ్లేయులతో చేతులు కలిపాడు.

ఇక్కడ అభద్రతా భావం నవాబు వైఫల్యానికి ప్రధాన కారణమైంది.

బెంగాల్‌లో కేవలం కుట్రతో ఆంగ్లేయులు సిరాజ్ ఉద్దౌలాను ప్లాసీయుద్ధంలో ఓడించారు.

కుట్రను గ్రహించకపోవడం సిరాజ్ వైఫల్యానికి కారణమైంది.

మొఘల్ చక్రవర్తి బలహీనత అసమర్ధత అతడి వైఫల్యానికి ప్రధాన కారణమయ్యాయి.

మరాఠాల విషయంలో చివరి పీష్వా అయిన రెండవ బాజీరావు ప్రమాదాన్ని శంకించి సైన్య సహకార పద్దతికి అంగీకరించి మరాఠా కూటమి పతనానికి కారకుడైనాడు.

పంజాబ్‌లో రంజిత్ సింగ్ మరణానంతరం జరిగిన ఆంగ్లో సిక్కు యుద్ధాల్లో సైనిక నాయకత్వం చేసిన విద్రోహాల వలన ముఖ్యంగా తేజా సింగ్ వలన సిక్కులు ఓటమి పాలయ్యారు.

పై కారణాలే కాక శిక్షణ పొందిన సైన్యాలు లేకపోవడం ఆధునిక ఆయుధ సంపత్తి లేకపోవడంతో ముఖ్యంగా బ్రిటీష్‌వారి కుట్రలు కుతంత్రాలను గ్రహించలేక పోవడం స్వదేశీ పాలకుల ఓటమికి దారితీసింది.


Next Story