ఎడారిలో ‘వాటర్ మదర్’.. కరువు కోరల్లో జలసిరులు

by  |
Amla Ruia
X

దిశ, ఫీచర్స్ : ‘రాజస్థాన్’ పేరు వింటేనే మనకు బీడు భూములు, ఎండిన పంటలు, నీటి ఎద్దడితో పాటు ఎటుచూసినా ఎడారి వాతావరణమే గుర్తొస్తుంది. కానీ ఆ భావన మార్చేందుకు నిర్విరామంగా కృషిచేసింది ఓ మహిళ. కరువు కోరల్లో చిక్కుకుని, ఎడారిని తలపిస్తున్న గ్రామాలకు జల కళ తేవాలనుకుంది. గుక్కెడు నీళ్ల కోసం అల్లాడుతున్న జనాల గోసకు చరమగీతం పాడాలనుకుంది. ఎండిన చెట్లతో వెక్కిరిస్తున్న ప్రాంతంలో పచ్చదనం నింపాలనుకుని.. వినూత్న ఆలోచనలు, సైంటిఫిక్ టెక్నిక్స్ అవలంబిస్తూ తన ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. స్థానిక కమ్యూనిటీల సాయంతో చెక్ డ్యామ్‌లను నిర్మించి తాగు, సాగు నీటి సమస్యకు చెక్ పెట్టింది. ఈ మేరకు 300కు పైగా గ్రామాలకు కొత్త వెలుగులు ప్రసాదించి ‘వాటర్ మదర్’గా కీర్తించబడుతున్న ‘ఆమ్లా రుయా’ సక్సెస్ స్టోరీ.

ఆమ్లా రుయా చేపట్టిన వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్ ద్వారా రాజస్థాన్‌ రాష్ర్టంలోని 3 లక్షలకు పైగా గ్రామస్తులు ప్రయోజనం పొందుతున్నారు. తను అమలు చేసిన నీటి సంరక్షణ చర్యలతో గతంలో ఎండిపోయిన హ్యాండ్ పంప్స్, బోర్‌వెల్స్‌‌లో నీటి వనరులు పెంపొందాయి. తాగు నీటికోసం ఆయా గ్రామస్తులు మైళ్ల దూరం నడవాల్సిన పరిస్థితి తప్పింది. ఇప్పుడు ఆ ప్రాంత రైతులందరూ పంటల ద్వారా సమిష్టిగా రూ.500 కోట్ల వార్షిక నికర ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

నీటి సంరక్షణే ధ్యేయంగా ‘ఆకార్ చారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించిన ఆమ్లా రుయా.. గ్రామస్తుల భాగస్వామ్యంతో స్థిరమైన నీటి వనరుల కల్పనకు చెక్ డ్యామ్‌లు నిర్మిస్తుంటుంది. ఈ విధంగా తన సొసైటీకి సేవలందించిన డైనమిక్ సోషల్ యాక్టివిస్ట్‌గా పేరు తెచ్చుకున్న రుయాను లక్ష్మీపతి సింగానియా-ఐఐఎం, లక్నో నేషనల్ లీడర్‌షిప్ అవార్డుతో సత్కరించింది. అంతేకాదు వందల గ్రామాలకు ‘వాటర్ మదర్’గా నిలిచినందుకు ‘దేవి అవార్డు’ కూడా ఆమెను వరించింది. ఈ మేరకు ప్రముఖ మ్యాగజైన్‌తో తన సోషల్ సర్వీస్ విశేషాలను పంచుకుంది.

వాటర్ హార్వెస్టింగ్‌తో పంటలు పండిచాలన్న ఆలోచన..

1990 చివరలో మేము ముంబైలో ఉంటున్నాం. అదే టైమ్‌లో రాజస్థాన్ తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, రైతులు ఇబ్బందులు పడుతున్నారనే వార్తలు నన్ను ప్రభావితం చేశాయి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు లారీల్లో తిండి గింజలతో పాటు వాటర్ ట్యాంకర్లను పంపించాయి. కానీ అది శాశ్వత పరిష్కారం కాదని అర్థమైంది. నిజానికి నా భర్త రాజస్థాన్‌లోని రాంగర్‌కు చెందినవాడే. దీంతో కొందరు వాటర్ ఎక్స్‌పర్ట్స్‌ను రాంగర్‌కు తీసుకెళ్లి పరిష్కారం చూపమని కోరాం. కానీ వారు సూచించిన సొల్యూషన్స్ ప్రాక్టికల్‌గా లేకపోవడంతో.. వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్స్‌‌ను సక్సెస్‌ఫుల్‌గా అమలు చేస్తున్న ఎన్జీవోను కలిశాం. ఆ తర్వాత మా ఫ్యామిలీకి చెందిన ‘ఆకార్ చారిటబుల్ ట్రస్ట్’ తరఫున ఎవరి ప్రమేయం లేకుండా పని మొదలుపెట్టా. ఇందుకు నా భర్తతో పాటు కుటుంబ సభ్యులు సపోర్ట్ చేశారు.

ఎక్కడి నుంచి మొదలెట్టారు?

నిజానికి పూర్వ రాజస్థాన్‌లో నిర్మించబడిన అనేక నీటి కుంటలు పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూల్స్‌‌ను తలపిస్తాయి. కానీ అవన్నీ ఎండిపోవడంతో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. మొదట ఆ నీటి కుంటలను పునరుద్ధరించే పని మొదలుపెట్టాం. వర్షం పడ్డప్పుడు చిన్న చిన్న నీటి కాల్వల గుండా ప్రవహించే నీరు ఏ అడ్డంకులు లేకుండా కుంటల్లోకి చేరి స్టోర్ అయ్యేలా ప్రణాళిక రూపొందించాం. ఇలా గ్రామస్తులతో‌పాటు జంతువుల తాగు నీటి అవసరాలను తీర్చగలిగాం. ఇంకో విషయం ఏమిటంటే.. తాగునీటి కోసం కొన్ని కి.మీల దూరం వెళ్లాల్సి రావడంతో అక్కడి స్థానికులు ఆడపిల్లలను స్కూళ్లకు పంపేవారు కాదు. అంతేకాదు ఈ గ్రామాల్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఇక్కడి అబ్బాయిలకు పెళ్లిల్లు కష్టమయ్యేది. ఇప్పుడు ఆ సమస్యలన్నీ తీరిపోయాయి. కేవలం 5సంవత్సరాల వ్యవధి అంటే 2005లోగా రాజస్థాన్‌లో దాదాపు 200తాగునీటి కుంటలను పునరుద్ధరించాం. వీటి ద్వారా సంవత్సరానికి కోటి లీటర్ల మంచి నీరు అందుతోంది.

చెక్‌డ్యామ్ ప్రాజెక్ట్స్ ఎప్పుడు ప్రారంభించారు?

కొండ ప్రాంతాల నుంచి కిందకు జాలువారిన నీరు కాల్వల గుండా ప్రవహిస్తున్నప్పుడు.. వాటికి అడ్డంగా అక్కడక్కడ ఆనకట్టల రూపంలో నిర్మాణాలు చేపట్టాం. దీనికి అయ్యే ఖర్చు తక్కువే కానీ, ప్రయోజనాలు అధికం. 2005లో అల్వార్‌లోని మండవార్ వద్ద మొదటి చెక్ డ్యామ్ నిర్మించాం. ఇందుకోసం 100మందికి పైగా స్థానికులు పనిచేయగా.. ఖర్చులో 70శాతం ఆకార్ చారిటబుల్ ట్రస్ట్ భరించగా, 30శాతం గ్రామస్తులు కంట్రిబ్యూట్ చేశారు. ఈ నిర్మాణం తర్వాత ఆ ప్రాంతంలోని 150పురాతన బావుల్లో భూగర్భ జలాలు పెరిగాయి. డ్యామ్‌లో స్టోర్ చేసిన నీరు.. భూగర్భంలో తన పూర్వ మార్గాల గుండా ప్రవహించి నీటి వనరులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఈ మేరకు రైతులు తిరిగి వ్యవసాయం మొదలుపెట్టారు. క్రమంగా చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఇదే ఫార్ములాను అమలు‌చేసి ఫలితాలు సాధించాం. గతంలో ఆయా గ్రామాల్లో 2శాతంగా ఉన్న రైతులు.. ఇప్పుడు 98శాతానికి పెరగడంతో పాటు ఏడాదికి ఖరీఫ్, రబీతో పాటు మూడో పంటగా కూరగాయలు పండిస్తుండటం విశేషం.

నిర్మించిన చెక్ డ్యామ్స్, ప్రయోజనం పొందిన గ్రామాలు..

మేము నిర్మించిన 250 చెక్ డ్యాముల్లో రాజస్థాన్‌లోనే 229 ఉండగా.. మహారాష్ట్ర 16, బీహార్ 1, ఒడిషా 1, హర్యానా 1, బుందేల్‌ఖండ్‌లోని ఝాన్సీలో 2 ఏర్పాటు చేశాం. ప్రతీ ఏట ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. భవిష్యత్‌లో ఇండియాలోని కరువు ప్రాంతాలన్నీ కవర్ చేయాలనుకుంటున్నాం. ఇప్పటివరకు 300కు పైగా గ్రామాల్లో 3 లక్షల మందికి పైగా ప్రజలు మా ఇనిషియేటివ్స్‌తో ప్రయోజనం పొందుతున్నారు. ఈ చెక్‌డ్యామ్స్‌పై రూ.15 కోట్ల(70% ట్రస్ట్-30% గ్రామస్తులు) వన్‌టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయగా ప్రస్తుతం ఏడాదికి సమిష్టిగా రూ.500 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నారు.

నీటి సంరక్షణపై సందేశం..

ఒకవేళ భవిష్యత్‌లో 3వ ప్రపంచయుద్ధం గనుక సంభవిస్తే.. అది నీటి సమస్య మీదనే. ఇంకా చాలా మంది ప్రజలు మందుకొచ్చి వాటర్ హార్వెస్టింగ్‌ ఇనిషియేటివ్‌లో పాల్గొనాలని కోరుకుంటున్నా. మరిన్ని చెక్‌డ్యాముల నిర్మాణానికి డొనేట్ చేయాలనుకుంటే ‘ఆకార్ చారిటబుల్ ట్రస్ట్’ను సంప్రదించండి.


Next Story

Most Viewed