ప్రేమ.. హత్య.. ఓ డాక్టర్

by  |
ప్రేమ.. హత్య.. ఓ డాక్టర్
X

కలం పట్టిన చేతితోనే కత్తి పట్టాడు. ప్రాణం పోసే వృత్తి చేపట్టాల్సిన వాడు ప్రాణం తీశాడు. మెడలో స్టెతస్కోప్ వేసుకునే చేయికి బేడీలు వేసుకుని జైలుకెళ్లాడు. రోగుల చేయి పట్టి నాడీ చూసే సమయంలో జైలులో ఊచలు లెక్క పెట్టాడు. అయినా, లక్ష్యాన్ని మార్చుకోలేదు, గమ్యాన్నీ వీడలేదు. అటు కన్నవారికి ఇటు కలిసి తిరిగిన వారికి షాకిచ్చినా మళ్లీ ఆశయం వైపు కదిలాడు. ఎక్కడ జీవితాన్ని చీకటి మయం చేసుకున్నాడో అక్కడికే వచ్చి నిలబడ్డాడు. 14 ఏళ్లు జైల్లో ఉన్నా మళ్లీ ప్రాణం పోసే వృత్తిలోకే వచ్చాడు. మర్డర్ చేసిన చేతులతోనే డాక్టర్ పట్టా పొంది ప్రజల్లోకి వచ్చి వైద్యం చేస్తున్నాడు. ఇదంతా కర్ణాటకలో జరిగిన కథ. వివరాలేంటో చూద్దాం.

కర్ణాటక రాష్ట్రం కాలాబురగికి చెందిన సుభాష్ పాటిల్ డాక్టర్ కావాలన్న లక్ష్యంతో 1997లో ఎంబీబీఎస్ సీటు సాధించాడు. మూడో సంవత్సరం వరకు చదువు, ఇల్లు తప్ప మరో లోకం తెలియని సుభాష్‌కు తన ఇంటికి సమీపంలో ఉండే మహిళతో పరిచయం ఏర్పడింది. అప్పటికే ఆమెకు పెళ్లయింది. విషయం భర్తకు తెలియడంతో ఇద్దరినీ హెచ్చరించాడు. అయినా పట్టించుకోకుండా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో మరోసారి వారిని ఆమె భర్త హెచ్చరించాడు. దీంతో అతని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న సుభాష్, సదరు మహిళతో కలసి అతన్ని హత్య చేశారు. మృతదేహాన్ని మాయం చేశారు. కొద్ది రోజుల తర్వాత హత్య కేసులో ఇద్దరు దోషులుగా తేలడంతో 2002లో వారికి స్థానిక కోర్టు జీవిత ఖైదు విధించింది.

ఎంబీబీఎస్ మూడో సంవత్సరంలో జైలుకెళ్లిన సుభాష్ 14 ఏళ్ల పాటు శిక్ష అనుభవించాడు. సత్ప్రవర్తన కారణంగా 2016లో జైలు నుంచి విడుదలయ్యాడు. బయటకు వచ్చాక తన డాక్టర్ కల సాకారం కోసం ప్రయత్నాలు మొదలెట్టాడు. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూ యూనివర్సిటీకి విన్నవించుకున్నాడు. ఎంబీబీఎస్ పూర్తి చేస్తానని తనకు సహకరించి అవకాశం ఇవ్వాలని కోరాడు. న్యాయ సలహా అనంతరం సుభాష్ పాటిల్ చదువుకునేందుకు యూనివర్సిటీ ఓకే చెప్పడంతో 2019లో ఎంబీబీఎస్, లేటెస్ట్‌గా ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు పూర్తిస్థాయి డాక్టర్‌గా సేవలందించేందుకు సిద్ధమయ్యాడు. గతంలో జైలు జీవితం అనుభవించినా ఇప్పుడు చేసిన తప్పు తెలుసుకొని అనుకున్న వైద్య వృత్తిలోకి అడుగు పెడుతుండటంతో పలువురు ప్రశంసిస్తున్నారు.



Next Story

Most Viewed